రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకునేవారు ఈ నెల 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్ తెలిపారు.బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ హరీష్ గృహలక్ష్మి పథకం అమలు, తెలంగాణకు హరిత హరం పై గృహ నిర్మాణ శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ” గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఇండ్లు లేని నిరుపేదల కోసం ఖాళీ స్థలం ఉండి సొంత ఇల్లు కట్టు కోవడానికి 3లక్షలు ఆర్ధిక సహాయం అందించే గృహలక్ష్మి కోసం దరఖాస్తుదారులు దరఖాస్తు చేసే విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గృహలక్ష్మి దరఖాస్తుల స్వీకరణకు మున్సిపల్, ఎంపిడివో కార్యాలయాలలో ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.
స్వంత ఇంటి స్థలం, ఆహారభద్రత కార్డ్, ఆధార్ కార్డ్ ఉన్నవారు గృహాలక్ష్మి పథకానికి అర్హులు అని అన్నారు. ఆర్ సి సి ఇల్లు ఉన్నవారు, 59వ జీవో కింద కవర్ అయిన వారు ఈ పథకానికి అనర్హులని జిల్లా కలెక్టర్ హరీష్ స్పష్టం చేశారు.
ఈనెల 12వ తేదీ వరకు అన్ని ఎంపీడీవో కార్యాలయాలు, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గృహలక్ష్మి పథకానికి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, ఇందుకుగాను మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు,వారి వారి కార్యాలయాలలో తక్షణమే కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని నియమించాలని ఆదేశించారు.దరఖాస్తులను తెల్ల కాగితం పైన కానీ లేదా టైపు చేసిన కాగితం ద్వారా గాని సమర్పించవచ్చని తెలిపారు.
సెప్టెంబర్ లో పెరగనున్న ఉల్లి ధరలు ..
ప్రతిరోజు స్వీకరించిన దరఖాస్తులను మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు ఏరోజుకారోజు గృహ నిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. వచ్చిన దరఖాస్తులన్నింటిని 12వ తేదీ తర్వాత 20వ తేది వరకు క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, జిల్లా పరిషత్ సిఈఓ దీలిప్ కుమార్, జిల్లా పరిశ్రమల, హౌసింగ్ అధికారి రాజేశ్వర్ రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి, సంబంధిత ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Share your comments