ఆదిలాబాద్ లో వచ్చే విద్యా సంవత్సరం నుండి కొత్త వ్యవసాయ కళాశాల ప్రారంభించాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం అధికారులు నిర్ణయించారు. 60 సీట్లతో వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేయాలని రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయంలో ఏప్రిల్ 1న జరిగిన అకడమిక్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
వ్యవసాయ యూనివర్శిటీ ఇన్ ఛార్జ్ వైస్ ఛాన్స్ లర్ రఘునందన్ రావు, రిజిస్ట్రార్ డాక్టర్ సుధీర్ కుమార్ తో పాటు ఫ్యాకల్టీ డీన్స్, అకడమిక్ కౌన్సిల్ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొని పలు అంశాల పై చర్చించారు. అలాగే సంగారెడ్డి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజీలో సాయిల్, వాటర్ కన్జర్వేషన్ ఇంజనీరింగ్ లో పీహెచ్ డీ కోర్సు, ఫార్మ్ మిషనరీ అండ్ పవర్ ఇంజినీరింగ్, ప్రాసెసింగ్ అండ్ పుడ్ ఇంజనీరింగ్ పీజీ కోర్సులను ప్రవేశపెట్టుటకు ఆమోదం తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరంలో పీజీ సీట్లను 206 నుంచి 210కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. బీఎస్సీ(ఆన్సర్స్) అగ్రికల్చర్ కోర్సులో 955 సీట్లు, బీటెక్ (అగ్రి కల్చర్ ఇంజనీరింగ్)లో 87, బీటెక్ (పుడ్ టెక్నాలజీ)లో 77, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ లో 121 సీట్ల భర్తీకి ఆమోదం తెలిపారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం అనుబంధంగా రాష్ట్రంలో ఐదు అగ్రికల్చరల్ కాలేజీలు, రెండు ఇంజనీరింగ్ & టెక్నాలజీ కాలేజీలు, ఒక హోమ్ సైన్స్ కాలేజీ ఉన్నాయి. అలాగే 13 పాలిటెక్నిక్‌లు (వ్యవసాయంలో 11, సీడ్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్‌లో ఒక్కొక్కటి) ఉన్నాయి. ఈ కాలేజీలు వివిధ స్థాయిలలో వ్యవసాయానికి సంబంధించి రకరకాల కోర్సులను అందిస్తున్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టోరల్ అండ్ డిప్లొమా, రాష్ట్రంలోని మూడు వ్యవసాయ-వాతావరణ మండలాలలో ఉన్న 15 పరిశోధనా కేంద్రాలలో విశ్వవిద్యాలయం యొక్క పరిశోధన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా 9 జిల్లా వ్యవసాయ సలహా, సాంకేతిక కేంద్రాల బదిలీ (DAATTCలు), 7 కృషి విజ్ఞాన్ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ (EEI), అగ్రికల్చరల్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్ (AICC), ఎలక్ట్రానిక్ వింగ్, అగ్రికల్చరల్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ATIC) ఫార్మర్స్ కాల్ సెంటర్ (FCC)లు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం అనుబంధంగా ఉన్నాయి.
రైతులకు శుభవార్త : ఈ పంటకు కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం !
తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU). రాష్ట్ర ఆవిర్భావ అనంతరం వ్యవసాయ యూనివర్శిటీకి ప్రముఖ విద్యావేత్త, గొప్ప తెలంగాణ సిద్ధాంతకర్త అయిన ప్రొఫెసర్ జయశంకర్ గౌరవార్థం ఆయన పేరును వ్యవసాయ యూనివర్శిటీకి ప్రభుత్వం పెట్టింది. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రజలకు ప్రధానంగా వ్యవసాయంలో విద్యను అందించడం ఈ యొక్క యూనివర్శిటీ లక్ష్యం. క్షేత్ర స్థాయిలో పరిశోధనలు చేపట్టడం, వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలను ప్రోత్సహించడం అగ్రి కల్చర్ యూనివర్శిటీ లక్ష్యం.
Share your comments