
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పునఃప్రారంభం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహాసభలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు పాల్గొన్నారు. ప్రజలతో కిటకిటలాడిన సభా ప్రాంగణం అభివృద్ధి పునఃప్రారంభానికి వేదికగా మారింది.
కేంద్రం పూర్తిస్థాయి మద్దతు ఇస్తుంది: ప్రధాని మోదీ
“ఇంద్రుడు ఏలిన అమరావతే, ఆంధ్రుల రాజధానిగా అభివృద్ధి చెందుతుండడం గర్వకారణం,” అని ప్రధాని మోదీ అన్నారు. నవ్యాంధ్ర నవరాజధాని అభివృద్ధికి కేంద్రం తరపున అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. “ఇవి కేవలం శంకుస్థాపనలు కాదు, ఏపీ ప్రజల కలలకు రూపకల్పన, వికసిత్ భారత్‌కు నిదర్శనాలు” అన్నారు. దాదాపు రూ.60 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు.
రైతుల త్యాగం వల్లే అమరావతి నిజం అవుతోంది: సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ, “అమరావతి కేవలం నగరం కాదు, ఇది ఐదు కోట్ల ప్రజల గుండె తడిపిన సెంటిమెంట్. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు అమరావతి కోసం సమర్పించారు,” అని తెలిపారు. “గత ఐదేళ్ల విధ్వంసం తర్వాత, ఈ రోజు చరిత్రలో లిఖించదగ్గ రోజు,” అని భావోద్వేగంగా అన్నారు.
అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. “క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాలు, గ్లోబల్ కనెక్టివిటీ – ఇవన్నీ అమరావతిలో స్థాపిస్తాం,” అని వివరించారు. “రైతుల పోరాటానికి ఇది గెలుపు. ఉద్యమించిన ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేస్తున్నా. మోదీగారు రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారు. ఇంకొంచెం సహకారంతో ఏపీని బలమైన ఆర్థిక శక్తిగా రూపుదిద్దుతాం,” అన్నారు చంద్రబాబు.
రైతుల త్యాగానికి న్యాయం జరగింది: పవన్ కల్యాణ్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో భావోద్వేగానికి లోనయ్యారు. “ఒక్క పిలుపుతో వేల ఎకరాలు సమర్పించిన రైతులకు శిరస్సువంచి నమస్కరిస్తున్నా. వారు కేవలం భూములు కాదు, రాష్ట్ర భవిష్యత్తు అంకితం చేశారు,” అని అన్నారు.
“గత ప్రభుత్వ హయాంలో అన్యాయం జరిగిన రైతులకు ఇప్పుడు న్యాయం జరుగుతోంది. మేం వారి బాధ్యతను భుజాన వేసుకుంటాం. రాజధానిని అద్భుతంగా నిర్మించి వారి రుణం తీర్చుకుంటాం,” అని హామీ ఇచ్చారు.
మోదీ నిబద్ధతకు నిదర్శనం: పవన్ ప్రశంస
అత్యవసర పర్యటనల మధ్య అమరావతికి విచ్చేసిన ప్రధాని మోదీపై ప్రత్యేకంగా స్పందించిన పవన్, “ఇది మోదీ గారి అమరావతిపై ఉన్న ప్రేమకు నిదర్శనం. పహల్గామ్ ఘటన సమయంలో కూడా ఆయన అమరావతికి రావడం గొప్ప విషయం,” అని కొనియాడారు. కేంద్ర-రాష్ట్ర సమన్వయంతో అభివృద్ధి వేగంగా సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నూతన శకానికి నాంది
ఈ కార్యక్రమం అమరావతి పునర్నిర్మాణానికి శుభారంభం మాత్రమే కాదు, నవ్యాంధ్రకు దిశానిర్దేశక ఘట్టంగా నిలిచింది. కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధికి పునాది పడిన రోజు ఇది. ప్రజల త్యాగానికి, నాయకత్వ నిబద్ధతకు ఇది ఉజ్జ్వల ఉదాహరణ.
Read More:
Share your comments