వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను స్థానికంగానే పంచాయతీలో నెలకొల్పి వ్యవసాయ అభివృద్ధికి అవసరమైన అన్ని కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించే ప్రతిష్ఠితమైన ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ రంగఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్ష సమావేశంలో భాగంగా వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా రంగాల రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని రైతులకు అందించడం కోసం జాతీయంగా, అంతర్జాతీయంగా నైపుణ్య సంస్థలు, యూనివర్సిటీల సహకారం తీసుకోని వ్యవసాయ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త వంగడాలు, సాగులో సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయాలని వ్యవసాయ,హార్టికల్చర్,సెరికల్చర్, ఆక్వా కల్చర్ ముఖ్య అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.
ముఖ్యమంత్రితో జరిగిన వ్యవసాయ రంగ ముఖ్య అధికారుల సమీక్షా సమావేశంలో కొన్ని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. ఉద్యానపంటల్లో గరిష్ట సాగుతో ఏపీ ప్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిందని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. కొబ్బరి, అరటి, బొప్పాయి, మిరప, టమోట, ఉల్లి, బత్తాయి పంటల సాగుపై సీఎంకు వివరాలందించారు. వీటి సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం జగన్ సూచించారు
అలాగే కర్నూలు జిల్లాలో విస్తారంగా సాగుచేసే
ఉల్లి పంటకు ప్రపంచవ్యాప్తంగా మంచి మార్కెట్ ఉన్నందున ఫుడ్ ప్రాసెసింగ్‌కు అనుకూలంగా ఉన్న వెరైటీలు సాగయ్యేలా చూడాలి సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కొబ్బరిసాగులో ఎదురవుతున్న సమస్యల మీద నిరంతరం పరిశోధనలు కొనసాగాలని హార్టికల్చర్ విశ్వవిద్యాలయం వీసీని సీఎం జగన్ ఆదేశించారు.రైతుభరోసా కేంద్రాలల్లో పనిచేసే అగ్రికల్చర్ అసిస్టెంట్లు పనితీరు మెరుగు పడేలా మరిన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, అవసరమైతే అగ్రికల్చర్ విద్యార్థులు తప్పనిసరిగా ఆర్బీకేల్లో కనీసం నెలరోజులపాటు పనిచేసేలా నిబంధన పెట్టాలని అధికారులకు సూచించడం జరిగింది. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ లు, కొందరు వ్యవసాయ ప్రముఖులు పాల్గొనడంతో ఈ సమీక్ష సమావేశానికి అధిక ప్రాముఖ్యత సంతరించుకుంది.
Share your comments