ధాన్యం సేకరణపై మిల్లర్లకు ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం సేకరణలో మిల్లర్ల ప్రమేయం వద్దని ఆదేశించారు. ధాన్యం ఏ మిల్లులకు పంపాలనేది అదికారులే నిర్ణయించాలని, రైతులకు ఎక్కడా, ఏ విధంగా నష్టం జరగకూడదని జగన్ స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ, రేషన్ డోర్ డెలివరీపై తాజాగా సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరగాలన్నారు. ఏ ఊరి పంట ఏ మిల్లర్ దగ్గరికి వెళుతుందనే విషయం అధికారులకు మాత్రమే తెలియాలని, అవసరమైతే జిల్లా కలెక్టర్లు గోనె సంచులు సేకరించాలని జగన్ సూచించారు. వ్యవసాయ సలహా కమిటీలను యాక్టివేట్ చేయాలని, అన్ని అంశాలపై వ్యవసాయ సలహా కమిటీలకు పూర్తి అవగాహన కల్పించాలని జగన్ తెలిపారు.
క్రాప్ ప్లానింగ్ మొదలు రైతులకు అండగా కమిటీ ఉండాలని, మహిళా రైతులను కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని జగన్ చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసే సమయంలో తేమ చూసేందుకు రైతు భరోసా కేంద్రాల వద్ద మీటర్ల ఉన్నాయన్నారు. జిల్లా యూనిట్‌గా తీసుకుని ధాన్యాన్ని మిల్లల దగ్గరకు పంపాలన్నారు.
కొనుగోలు చేస్తామని చెప్పిన టైంకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ప్రక్రియ అంతా ప్రభుత్వమే చేపట్టాలని అధికారులకు జగన్ చెప్పారు. పౌరసరఫరాల శాఖ కూడా రైతు భరోసా కేంద్రాలను ఓన్ చేసుకోవాలని, రైతులు బయట విత్తనాలు కొని మోసపోకుండా వ్యవసాయ శాఖ చూసుకోవాలన్నారు. రెండు శాఖలు కలిసి పనిచేస్తేనే ఫలితముంటుందన్నారు.
Share your comments