News

ఈ అరటి పండు తింటే అచ్చం ఐస్ క్రీమ్ తిన్నట్లే ఉంటుందట. దీన్ని ఎలా పెంచాలంటే..

KJ Staff
KJ Staff
ఈ అరటి పండు తింటే అచ్చం ఐస్ క్రీమ్ తిన్నట్లే.
ఈ అరటి పండు తింటే అచ్చం ఐస్ క్రీమ్ తిన్నట్లే.

చాలామందికి అరటి పండ్లంటే ఇష్టం. సులువుగా ఎక్కడైనా తినేందుకు వీలుగా ఉంటాయి ఈ పండ్లు. చాలామందికి నెలల వయసులోనే దీన్ని అలవాటు చేస్తారు. దీన్ని తినేందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకపోవడమే దీనికి కారణం.

కానీ మనందరికీ అరటి పండు రుచి ఎలా ఉంటుందో తెలుసు. మరి, ఎప్పుడైనా వెనిలా ఐస్ క్రీమ్ లా రుచించే అరటి పండును తిన్నారా? అంతే కాదు.. మనకు తెలిసిన అరటి పండ్లు అయితే ఆకుపచ్చ రంగులో లేదా పసుపచ్చ రంగులో ఉంటాయి. అక్కడక్కడా ఎరుపు రంగులో కూడా అరటి పండ్లు కనిపిస్తుంటాయి. కానీ ఎప్పుడైనా నీలి రంగు అరటి పళ్లు చూశారా? అదే ఈ జావా బ్లూ బనానా స్పెషాలిటీ.. ప్రత్యేకమైన రంగుతో మంచి క్రీమీ టేస్ట్ తో ఆకట్టుకుంటుంది. దీన్ని తిన్నవాళ్లు ఇది అచ్చం వెనిలా ఐస్ క్రీం రుచిని కలిగి ఉంటుందని చెప్పడం విశేషం. ఇది మ్యూసా బాల్బిసియానా, మ్యూసా అక్యుమినాటా అనే రెండు రకాల గింజలున్న అరటి పండ్లను కలిపి తయారుచేసిన రకం ఇది. ఇందులో ఒకటి తినే రకం అయితే మరొకటి కూరల కోసం పచ్చిగా ఉపయోగించే రకం. ఈ రెండింటి కలయిక వల్లే బ్లూ జావా బనానాకి అంత క్రీమీ రుచి వచ్చిందని చెప్పుకోవచ్చు.

తాజాగా ఒగ్లివీ సంస్థ గ్లోబల్ సీసీఓ థామ్ ఖై మెంగ్ ట్విట్టర్లో చేసిన పోస్ట్ తో మళ్లీ ఈ అరటి పండ్లు పాపులర్ గా మారాయి. ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో వీటి ఫొటోను పోస్ట్ చేస్తూ "ఇప్పటి వరకు నాకు ఎవరూ బ్లూ జావా బనానా మొక్కలను పెంచమని ఎందుకు చెప్పలేదు? వీటి రుచి ఐస్ క్రీంలా ఎంతో అద్భుతంగా ఉంది" అంటూ ఈ అరటి పండ్లకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. ఈ అరటి పండ్లు దక్షిణాసియాలో ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా హవాయి ప్రాంతంలో దీన్ని ఎక్కువగా పండిస్తారు. అక్కడ దీన్ని ఐస్ క్రీం బనానా అని పిలుస్తారు. ఈ మొక్కల ఆకులు కూడా సిల్వర్ గ్రీన్ రంగులో ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ ట్వీట్ చూసిన చాలామంది ఈ అరటి పండ్ల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

మన దేశంలో ఇవి ఇంకా అరుదు కానీ ఫిలిప్ఫీన్స్, హవాయి, అమెరికా, ఫిజి వంటి దేశాల్లో వీటిని ఎక్కువగా పండించడంతో పాటు ఉపయోగిస్తుంటారు కూడా. ఇవి రుచిగా ఉండడం మాత్రమే కాదు.. అందులో పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయట. ఈ అరటి పండ్ల చెట్లు చాలా పెద్దగా పెరుగుతాయి. గట్టిగా ఉంటూ గాలి, చలి వంటివి కూడా తట్టుకుంటాయి. ఈ పండు రుచితో పాటు వాసన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక గెలకు కేవలం ఏడు నుంచి పది అరటి పండ్లు మాత్రమే కాస్తాయి. అందుకే గెలలు చాలా చిన్నగా ఉంటాయి. ఇవి పండకముందు నీలి రంగులో ఉంటాయి. పండిన తర్వాత లేత పసుపు రంగులోకి మారతాయి. ఈ పండ్లు తొమ్మిది అంగుళాల సైజు వరకు పెరుగుతాయి. ఈ మొక్క పండ్లను అందించేందుకు రెండు మూడేళ్లు పడుతుంది. ఈ అరటిని పండించేందుకు చాలా తక్కువ ఉష్ణోగ్రతలు ఉండాలి. నాలుగు నుంచి ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఇవి బాగా పెరుగుతాయి. మన దేశంలో వీటిని పెంచాలంటే గ్రీన్ హౌజ్ లలో పెంచాల్సి ఉంటుంది. ఇక్కడి నేల వాటికి సరిపోయినా.. వాతావరణ పరిస్థితులు మాత్రం ఇది తట్టుకోవడానికి కొంచెం కష్టం. అందుకే వీలైనంత చల్లగా ఉండేలా చూసుకోవాలి.

దీన్ని నాటేందుకు మంచి పోషకాలు ఉండే నేల అవసరం. మరీ ఎక్కువ ఎండ లేక మరీ ఎక్కువ నీడ లేకుండా ఉండేలా చూసుకోవాలి. నీటి లభ్యత కూడా కాస్త ఎక్కువగానే ఉండాలి. నేల పీహెచ్ 5.5 నుంచి 6.5 స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. ఈ అరటి పండ్లను పిలకల సాయంతోనే నాటుకోవాలి. పెద్ద చెట్టుకు పక్కన పదుల కొద్దీ పిలకలు వస్తాయి. వాటిని తీసి వేరేగా నాటితే మొక్కలు పెద్దగా పెరుగుతాయి. అయితే ఈ పిలకలు దాదాపు మూడు అడుగుల వరకు పెరిగిన తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి ముందు పెద్ద పెద్ద ఆకులు లేకుండా తీసేసి ఆ తర్వాత నాటుకోవాలి. దీన్ని మరీ లోతుగా నాటాల్సిన అవసరం కూడా ఉండదు. దీని చుట్టూ ఉండే నేల తడి ఆరిపోకుండా చూసుకోవాలి. అందుకే డ్రిప్ పద్ధతిలో నీటిని అందించడం మంచిది. మరీ ఎక్కువ నీటిని అందిస్తే మొక్క వేళ్లు మురిగిపోయి పాడైపోతాయి. నాటిన తర్వాత నెల పాటు వాటికి ఎరువులు కూడా అందించాలి. ఇలా కనీసం 15 నుంచి 24 నెలల పాటు ఈ అరటి మొక్కలకు తగిన పోషణ, నీరు అందిస్తుంటే అప్పుడు పూలు కనిపిస్తాయి. పూలు కనిపించిన తర్వాత 150 రోజుల పండ్లు పొందే వీలుంటుంది.

https://krishijagran.com/agripedia/banana-cultivation-in-india-here-s-a-complete-guide-for-beginners/

https://krishijagran.com/agripedia/are-you-a-banana-grower-here-are-ways-to-enhance-your-crop/

Share your comments

Subscribe Magazine

More on News

More