దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. తొలి వేవ్ కంటే సెకండ్ వేవ్ మరింతగా జూలు విడుస్తూ విరుచుకుపడుతోంది. గతంలో కంటే రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు రికార్డులు బద్ధు కొడుతున్నాయి. రోజూ దాదాపు 2 లక్షల వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయంటే.. దేశంలో కరోనా ప్రతాపం ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో.. ప్రజల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. వ్యాక్సిన్ వేయించుకున్నవారికి కూడా కరోనా వస్తుండటంపై చర్చ నడుస్తోంది.
ప్రపంచంలోనే అమెరికా తర్వాత ఇండియానే కరోనా కేసుల్లో రెండో స్థానంలో ఉంది. రోజువారీ కేసుల్లో ఇండియా తొలి స్థానంలో ఉంది. దీంతో పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూతో పాటు లాక్‌డౌన్ విధిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ , ఛత్తీస్ గఢ్, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించగా. ఇప్పటికే లాక్‌డౌన్ వల్ల ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడంతో.. మళ్లీ లాక్‌డౌన్ విధించేందుకు రాష్ట్రాలు ఆసక్తి చూపడం లేదు.
ఈ క్రమంలో విద్యార్థుల పరిస్థితి మళ్లీ అగమ్యగోచరంగా మారింది. రాష్ట్రాలన్నీ పరీక్షలను రద్దు చేస్తున్నాయి. బుధవారం కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. నిన్న విద్యాశాఖ అధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించి పరీక్షల నిర్వహణపై చర్చించారు. కరోనా క్రమంలో పరీక్షలను నిర్వహించడం సరికాదని అధికారులు సూచించడం, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరీక్షలను రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండటంతో.. పరీక్షలను రద్దు చేస్తూ మోదీ నిర్ణయం తీసుకున్నారు.
సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన కేంద్రం.. 12వ తరగతి పరీక్షలను కొద్దిరోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. 12వ తరగతి పరీక్షలపై మరోసారి సమీక్ష నిర్వహించి కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తామంది. 10వ తరగతి విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు తెలిపింది.
10వ తరగతి విద్యార్థులకు మార్కులు ఎలా ఇస్తారు?
-ఇంటర్నల్ అసైన్‌మెంట్ మార్కుల ఆధారంగా మార్కులు ఇస్తారు.
-ఒకవేళ ఇంటర్నల్ అసైన్‌మెంట్ మార్కులకు విద్యార్థులు సంతృప్తి చెందకపోతే కరోనా ప్రభావం తగ్గిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తారు.
కాగా, మే 4 నుంచి జూన్ 7 వరకు 10 వ తరగతి పరీక్షలు, మే 4 మరియు జూన్ 15 వరకు 12వ తరగతి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. వాటిని ఇప్పుడు రద్దు చేశారు.
Share your comments