రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచి వ్యవసాయంలో వారికి అండగా నిలవడాన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారు.ఈ పథకాల ముఖ్య ఉద్దేశం ప్రజలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పన మరియు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం.రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించి,అమలు చేస్తున్న ముఖ్యమైన కొన్ని పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకం: కేంద్ర ప్రభుత్వం 2019లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి అమలు చేస్తున్న అతి ముఖ్యమైన పథకం "ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన". ఈ పథకం ద్వారా దేశంలోని అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి మూడు విడతల్లో ఒక్కొక్కసారి 2 వేల చొప్పున 6 వేల రూపాయలు ఆర్థిక సాయాన్ని నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది.ఇప్పటివరకు 8 విడతల్లో ఈ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా దాదాపు 12 కోట్లు మంది రైతులకు 22 వేల కోట్ల రూపాయలను వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది.తాజాగా 9.75 కోట్ల మంది రైతులకు19,500 కోట్ల రూపాయలను తొమ్మిదో విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేయడం జరిగింది.
డీబీటీ పోర్టల్,డీబీటీ కృషి యంత్ర యోజన పథకం : వ్యవసాయంలో నూతన యంత్రాలను వినియోగించుకొని అధిక దిగుబడులు సాధించి
రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి, వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తుంది. వ్యవసాయ యంత్రాలపై భారీ ఎత్తున రాయితీలు ఇస్తుంది. ఈ పథకంలోనూ రైతుల ఖాతాకు నేరుగా డబ్బులు బదిలీ చేయడం జరుగుతుంది. దీనివల్ల రైతుల సబ్సిడీ ఏ మధ్యవర్తికి చేరకుండా నేరుగా వారికే ప్రయోజనం చేకూరుతుంది. ఈ పథకం ద్వారా రైతుల ఆర్థిక పరిస్థితిలో మార్పులు కనిపిస్తోంది
ఈ-నామ్ పోర్టల్ :నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్
అనేది పాన్-ఇండియా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పోర్టల్. ఇది వ్యవసాయ సంబంధిత ఉత్పత్తుల కోసం ఏకీకృత జాతీయ మార్కెట్‌ను సృష్టించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోర్టల్ ద్వారా దేశంలోని రైతులు తమ పంటలను ఎక్కడైనా విక్రయించవచ్చు. ఇందులో మొత్తం ఆన్‌లైన్ విధానమే ఉంటుంది. ట్రాన్సాక్షన్స్ కూడా ఆన్‌లోనే జరుగుతాయి.
సాయిల్ హెల్త్ కార్డు పథకం : వ్యవసాయంలో మోతాదుకు మించి ఎరువులను వాడడం వల్ల నేల నిస్సారంగా అవడమే కాకుండా రైతులకు అదనపు భారంగా మారుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి నేలలోని పోషకాల లోపాన్ని గుర్తించి అవసరమైన ఎరువులను మాత్రమే వాడే విధంగా రైతులను ప్రోత్సహించడానికి 2014 సంవత్సరంలో సాయిల్ హెల్త్ కార్డ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రైతులకు ఉచితంగా భూసార పరీక్షలు నిర్వహించి తగిన సలహాలతో కూడిన నమూనా పత్రాన్ని అందజేస్తున్నారు.
Share your comments