తెలంగాణలోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ అందించారు. నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవాళ్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధంమైంది. తొలి దశలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ప్రభుత్వం ఉద్యోగంపై ఆశలు మొదలయ్యాయి. రెండోసారి కేసీఆర్ సీఎం అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు.
ఇప్పుడు ఎట్టకేలకు ఒకేసారి 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయనుండటంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ ఆర్థికశాఖ దీనిపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనుంది. ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి. తొలి దశలో ఎన్ని భర్తీ చేయాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అన్ని శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొని.. తమ శాఖలో ఉన్న ఉద్యోగ ఖాళీల వివరాలను వెల్లడించనున్నారు.
22 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శలు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శలు పూర్తి వివరాలతో ఈ సమావేశానికి హాజరుకావాలని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 13న ప్రగతిభవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేసీఆర్‌కు వివరాలను అందించనున్నారు.
ఈ రోజు ఆర్థికశాఖ నిర్వహించనున్న సమావేశంతో ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే దానిపై స్పష్టత రానుంది. ఉదయం 10 గంటలకు పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, పౌరసరఫరాలు, వినియోగదారుల శా ఖ, అటవీ పర్యావరణ, సాంకేతిక శాఖలతో, 10.30 గంటలకు నీటిపారుదల శాఖ, కార్మిక, ఉపాధి కల్పన, హోం, న్యాయ శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. 11 గంటలకు చట్టసభలు, పురపాలక, పట్టణాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక యువజన సర్వీసులు శాఖల అధికారులు, 11.30 గంటలకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్యం రెవెన్యూ విభాగాల అధికారులతో సమావేశం కానున్నారు.
12 గంటలకు రవాణా, రహదారులు, భవనాల శాఖ, గృహ నిర్మాణం, సాధారణ పరిపాలన శాఖ అధికారులతో ఆర్థిక శాఖ అధికారులు సమావేశమవుతారు. ఇక 12.30 గంటలకు ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన, మహిళా, శిశు సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.
Share your comments