ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ 6వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. వర్చువల్ పద్దతిలో జరిగిన ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొని తమ సూచనలు, సలహాలు ఇచ్చారు. తమ రాష్ట్రం తరపున పలు డిమాండ్లు చేశారు. కోవిడ్ తర్వాత జరిగిన ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల సీఎంలు తమ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రధానికి వివరించారు.
ఈ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగం, దాని అనుబంధ రంగాలను అభివృద్ధి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను ప్రధానికి వివరించారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఐదు రకాల చర్యలను తీసుకోవాల్సి ఉందని జగన్ చెప్పారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు రైతులకు అందేలా చేయాలన్నారు. వర్షాల వల్ల పంట నష్టపోయిన సమయంలో రైతులకు వెంటనే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని జగన్ తెలిపారు.
రైతులు తమ పంటలను సరైన ధరకు అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలని జగన్ సూచించారు. కోల్డ్ స్టోరేజ్‌కి సంబంధించి కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టాల్సి ఉందన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఆదుకోవాలని, రైతులకు అండగా నిలిచేందుకు ఏపీలో పలు పథకాలు ప్రవేశపెట్టామన్నారు.
సేంద్రీయ వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తున్నామని, రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు అందించడంతో పాటు ప్రతి రైతు భరోసా కేంద్రాల్లో సేంద్రీయ వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తామన్నారు. రాష్ట్రంలో 10.731 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జగన్ తెలిపారు.
Share your comments