దేశంలో కరోనా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని మిగిల్చింది. దీంతో నిత్యావసర సరుకులు, బియ్యం, పప్పు ధాన్యాల రేట్లు భారీగా పెరిగి.. సామాన్యులకు చుక్కులు చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గత సంవత్సరం నుంచి వంట నూనె ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ప్రభుత్వం.. వంటనూనెల ధరలపై దృష్టి పెట్టింది. వంట నూనెలపై బేస్ దిగుమతి ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పామ్ ఆయిల్, సోయాబిన్ ఆయిల్ వంటి వాటికి తగ్గింపు వర్తిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం కేంద్రం వంటనూనెల ధరలపై ఒక ప్రకటన చేసింది.
దేశంలో వంటనూనెల ధరలు తగ్గుతున్నట్లుగా వినియోగదారుల వ్యవహారాల ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఈ ప్రకటనలో తెలిపింది. అటు అంతార్జాతీయ మార్కెట్లో వంట నూనె ధరలు దిగిరావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. క్రూడ్ పామ్ ఆయిల్ ధరను టన్నుకు 1222 డాలర్ల నుంచి 1136 డాలర్లకు తగ్గించింది. అలాగే క్రూడ్ సోయా ఆయిల్ ధరను టన్నుకు 1452 డాలర్ల నుంచి 1415 డాలర్లకు తగ్గించింది. అటు ఆర్‌బీడీ పామ్ ఆయిల్ ధరను టన్నుకు 1245 డాలర్ల నుంచి 1148 డాలర్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో వంట నూనె ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఇది సామాన్యులకు ఊరట కలిగించే విషయమని చెప్పుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం వంట నూనె ధరలు దాదాపు 20 శాతం వరకు తగ్గాయి. తాజా రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 2021 మే 7న పామాయిల్ ధర కిలోకు రూ.142 ఉండగా... ప్రస్తుతం కిలోకు రూ. 115గా ఉంది. దీని ధరలు 19 శాతం తగ్గాయి. అలాగే సన్ ఫ్లవర్ ఆయిల్ మే 5న కేజీకి రూ.188 ఉండగా.. ఇప్పుడు రూ.157కు చేరింది. అంటే.. ఇందులో 16 శాతం తగ్గింది. అటు సోయా నూనె ధర కూడా భారీగానే తగ్గింది. మే 20న సోయా ఆయిల్ కేజీకి రూ. 162 ఉండగా.. ఇప్పుడు రూ. 138కు చేరింది. అలాగే 15 శాతం తగ్గింది. ఇక ఆవ నూనె ధరలు పెరిగాయి. దేశంలో ఎక్కువగా ఆవ నూనెను ఉపయోగిస్తున్నారు. అలాగే ఆవాల నూనె ధర కూడా మే 16న రూ.175 వద్ద ఉండేది. ఇది ఇప్పుడు రూ.157 క్షీణించింది. అలాగే వేరు శనగ నూనె ధర రూ.190 నుంచి రూ.174కు దిగొచ్చింది. వనస్పతి ధర రూ.154 నుంచి రూ.141కు తగ్గింది. ఈ రేట్లు ముంబై మార్కెట్‌కు వర్తిస్తాయి. వంటనూనెల ధరలు.. దేశంలో పండించే నూనె గింజల ఉత్పత్తిపై ఆధారపడి ఉంటాయి. మన దేశంలో వీటి ఉత్పత్తి ఎక్కువే.
Share your comments