రేషన్ కార్డు.. ఇది పేదవారికి అవసరమైన ముఖ్యమైన కార్డు. బీపీఎల్ కుటుంబాలకు తక్కువ ధరకే నిత్యావసర సరుకులు అందించేందుకు ప్రభుత్వాలు రేషన్ కార్డులు ఇస్తాయి. అలాగే అనేక ప్రభుత్వ పథకాలు పేదలకు అందాలన్నా.. రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన ఉంది. అందుకే బీపీఎల్ కుటుంబాలన్నీ తప్పనిసరిగా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటాయి. రేషన్ కార్డు ఉంటే ఒక భరోసా ఉంటుంది. ప్రతి నెలా ఇంట్లోకి అవసరమైన నిత్యావసర సరుకులు ప్రభుత్వ రేషన్ షాపుల్లో తక్కువ ధరకే లభిస్తాయి.
అయితే రేషన్ కార్డుకు సంబంధించి ప్రభుత్వం కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. వరుసగా మూడు నెలలు రేషన్ బియ్యం తీసుకోకపోతే రేషన్ కార్డు తొలగిస్తామని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ అసెంబ్లీ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా.. రేషన్ కార్డుల గురించి ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం తెలంగాణలో 80 శాతం మందికి రేషన్ కార్డులు ఉన్నాయని కమలాకర్ స్పష్టం చేశారు. కోటి 20 లక్షల మంది ప్రస్తుతం లబ్ధి పొందుతున్నారని, రేషన్ కార్డు జారీ ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటుందని తెలిపారు. కరోనా వల్ల కొత్త కార్డులు జారీ చేయలేకపోయామని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి త్వరలోనే లబ్ధిదారులకు కొత్త కార్డులు జారీ చేస్తామన్నారు.
తెలంగాణ ఏర్పడ్డాక 2019లో 3 లక్షల 59 వేల కొత్త కార్డులు ఇచ్చామని, నిజమైన అర్హులకు మాత్రమే కొత్త కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు కమలాకర్ చెప్పారు. గడిచిన మూడు ఏళ్లల్లో కొత్తగా 44 వేల కొత్త కార్డులు జారీ చేశామని, ఇంకా 97 వేల కొత్త కార్డులు పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని కమలాకర్ స్పష్టం చేశారు. 1 కోటి 91 లక్షల లబ్ధిదారులను పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పిందన్నారు.
Share your comments