News

భారీగా తగ్గిన చేపల ధర.

KJ Staff
KJ Staff
Fish Farming
Fish Farming

సాధారణంగా ఏ రకం చేపలు కొనాలన్నా కిలో రూ. 200 కి తక్కువ ఉండదు. అదే కోస్తా జిల్లాల్లో అయితే కిలో రూ. 120 నుంచి రూ. 150 వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు చేపల ధర ఎంతో తెలుసా? రూ. 40 నుంచి రూ.90. అవును..

అన్ని రకాల చేపల ధరలు తగ్గడంతో ఆక్వా రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు చేపల మార్కెట్ లో కిలో చేపలు రూ.40 కే అమ్ముతుండడం వారి పరిస్థితికి అద్దం పడుతోంది. గిట్టుబాటు లేక అటు మత్స్యకారులు, ఇటు చేపల పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు.

ప్రస్తుతం ఉత్తరాదిలో చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు..కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ లు విధిస్తున్నారు. దీని ప్రభావం చేపల ఎగుమతి, మార్కెటింగ్ పై పడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఆంక్షలు ఉండడం వల్ల ఆక్వా రైతులు ఆయా రాష్ట్రాలకు తమ సరుకును పంపలేకపోతున్నారు. కొన్ని పట్టణాల్లో అయితే మార్కెట్లు పూర్తిగా మూతబడ్డాయి. గతంలో రోజూ సుమారు 200 కి పైగా లారీల్లో దాదాపు 6500 టన్నుల చేపలు ఉత్తరాది రాష్ట్రాలకు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేవి. ఇప్పుడు అవి సగానికి తగ్గిపోయాయి. కేవలం 3900 టన్నుల మేర ఎగుమతి అవుతున్నాయి. దీంతో పదిహేను రోజుల్లోనే ధరలు సగానికి పడిపోయాయి. ఈ ఏడాది ప్రారంభంలో అందరూ రోగ నిరోధక శక్తిని బలంగా మార్చుకునేందుకు ప్రయత్నించడం వల్ల చేపల ధరలు పెరిగాయి.

అప్పట్లో టన్ను చేపల ధర రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.20 లక్షల వరకు పలికింది. ఇప్పుడు అది రూ. 70 వేలుగా ఉంది. సాధారణంగా ఈ సమయంలో కోస్తా జిల్లాల్లో చేపల ధర కిలో రూ. 150 గా ఉంటుంది. కానీ ఇప్పుడు రూ. 70 కి మించి లేకపోవడం రైతులను నష్టాల బారిన పడేస్తోంది. శీలావతి, కట్ల, బొచ్చె చేపల ధరకు కిలోకి రూ. 30 నుంచి రూ. 50 వరకు తగ్గడంతో రైతులు వాటిని చెరువుల్లోనే ఉంచుతున్నారు. దీంతో మేత, నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయి. సగటున ఒక టన్నుకు రూ. 20 నుంచి 30 వేల వరకు నష్టాలను చవి చూడాల్సి వస్తోంది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు 2.25 లక్షల హెక్టార్లలో చేపల సాగు చేస్తున్నారు. ఈ సాగు పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా ఎక్కువ ఇక్కడ రైతులు 1.20 లక్షల హెక్టార్లలో చేపల సాగు చేస్తున్నారు. ఆ తర్వాత స్థానాల్లో తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలు ఉన్నాయి. అసలే మేత, పెట్టుబడులు, లీజు, కూలీల ఖర్చు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇలా ధరలు తగ్గడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. గోదావరిలో నీళ్లు కూడా తక్కువగా ఉండడం వల్ల చేపలను పట్టి అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కాస్త నీటి సమస్య లేకపోతే రైతులు చేపలను నీటిలోనే కొంతకాలం పాటు ఉంచి ఆ తర్వాత ధరలు పెరిగిన తర్వాత అమ్ముకునే పరిస్థితి ఉంటుందని ఆక్వా రైతులు చెబుతున్నారు.

గుజరాత్, పశ్చిమ బెంగాల్ నుంచి కూడా చేపలు మార్కెట్లకు వస్తుండడంతో ఉత్తరాది రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతులు తగ్గాయి. దీంతో పాటు గతంలో సాగు చేయని బిహార్, ఒడివా, అసోం లాంటి రాష్ట్రాలు కూడా చేపల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టడంతో ఆయా రాష్ట్రాలకు కూడా ఎగుమతులు తగ్గాయి. ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణ, దిల్లీ మార్కెట్లకు తప్ప మిగిలిన మార్కెట్లన్నంటికీ వెళ్లే లారీల సంఖ్య తగ్గింది. కేవలం చేపలే కాదు.. రొయ్యల ధరలు కూడా చాలా తగ్గాయి. మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ లో రేట్లు పడిపోయాయని చెప్పుకోవచ్చు. 25 కౌంట్ రొయ్యలు గుజరాత్ లో కేజీకి రూ. 520 పలుకుతుంటే ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం వాటి ధర రూ. 500 గా ఉంది. 33 కౌంట్ రొయ్యల ధర కూడా గుజరాత్ లో రూ. 435 ఉంటే ఆంధ్రప్రదేశ్ లో మరీ తక్కువగా రూ. 360 కే లభిస్తున్నాయి.

https://krishijagran.com/agripedia/advantages-of-fish-farming-business/

https://krishijagran.com/agripedia/guide-for-rice-cum-fish-farming/

Share your comments

Subscribe Magazine

More on News

More