తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ తమ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. వ్యాక్సిన్ ఫ్రీగా అందించనున్నట్లు ప్రకటించారు. ఏపీలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు సీఎం వైఎస్ జగన్ నిన్న ప్రకటించగా.. తెలంగాణలో కూడా ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించినట్లు ఇవాళ సీఎం కేసీఆర్ ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వాలకు ఉచితంగా వ్యాక్సిన్ సరఫరా చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కూడా ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నట్లు ప్రకటించాయి.
తెలంగాణలో అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి రూ.2,500 కోట్ల ఖర్చు అవుతుందని, అయినా భరిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వారికి కూడా వ్యాక్సిన్ ఇస్తామన్నారు. తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారని, వీరిలో ఇప్పటికే 35 లక్షల మందికిపైగా వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు.
వయస్సుతో సంబంధం లేకుండా 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయంతంగా అమలు చేయడానికి జిల్లాల వారీగా ఇంచార్జ్ లను నియమించడం జరుగుతుందన్నారు. వ్యాక్సిన్, రెమిడిసివిర్, ఆక్సిజన్‌కు ఎలాంటి కోరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
జనం పెద్ద ఎత్తున గుంపులు గుంపులుగా తిరగవద్దని కేసీఆర్ సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దన్నారు. ఎల్లప్పుడూ క్రమశిక్షణ పాటించాలన్నారు. కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కేసీఆర్ తెలిపారు.
Share your comments