ఏపీ ఆయిల్ ఫామ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రైతులు దళారులకు పంట అమ్మి తీవ్ర నష్టపోతున్నారు. దళారులు మద్దతు ధర ఇవ్వకుండా తక్కువ ధరకే పంట కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆరుగాలం కష్టించి పండించిన రైతులు మోసపోతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మార్కెటింగ్ శాఖ ద్వారా ఆయిల్ ఫామ్ రైతుల నుంచి పంట కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆయిల్ ఫామ్ గెలలను టన్ను రూ.18 వేలు మద్దతు ధర ఇచ్చి రైతుల నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మార్కెటింగ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే రవాణా ఖర్చులకు కూడా డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 15 కిలోమీటర్లకు మెట్రిక్ టన్నుకు రూ.400, 16 నుంచి 30 కిలోమీటర్లలోపు అయితే రూ.459, 30 కిలోమీటర్లపైన అయితే రూ.700 అదనంగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీనికి సంబంధించి అధికారులకు మంత్రి కన్నబాబు ఆదేశాలు జారీ చేశఆరు. ఆయిల్ ఫామ్ రైతులు ప్రైవేట్ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ నిర్ణయం పట్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని కన్నబాబు స్పష్టం చేశారు. సీఎం జగన్ ఆదేశాలతో పెంచిన ధరను ఏప్రిల్ 20 నుంచి అమలు చేయాలని ఆయిల్ ఫెడ్‌కు నిర్దేశించామన్నారు.
అటు, చాలా పంటలను రైతుల నుంచి నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతులు దళారుల బారిన పడి నుంచి మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
Share your comments