అర్హులకు ప్రభుత్వ పథకాలు సత్వరమే అందేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులకు సూచించారు.
సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి తెలంగాణకు హరితహారం, గృహలక్ష్మి , ఇంటి పట్టాల పంపిణీ, జీఓ 59, బీసి, మైనారిటీ లకు లక్ష ఆర్థిక సహాయం, గొర్రెల పంపిణీ, దళిత బంధు వంటి పలు అంశాల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూబీసి కులవృత్తుల లక్ష రూపాయల ఆర్థిక సహాయం క్రింద మొదటి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 300 మంది లబ్దిదారులకు అందించడం జరుగుతుందని, దీనికి సంబంధించిన నిధులు జిల్లాలకు విడుదల చేశామని, ప్రతి అసెంబ్లీ పరిధిలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యేలతో ఆగస్టు 10 లోపు చెక్కుల పంపిణీ పూర్తి చేయాలని సీఎస్ సూచించారు.
మైనారిటీల సంక్షేమం క్రింద లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకంలో జనాభా ప్రాతిపదికన జిల్లాలకు లక్ష్యాలు నిర్దేశించామని అన్నారు. జిల్లాలకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు లబ్దిదారులను ఎంపిక చేసి ప్రోసిడింగ్స్ జారీ చేయాలని, ప్రోసిడింగ్స్ జారీ చేసిన వెంటనే నిధులు మంజూరు అవుతాయని చెక్కుల పంపిణీ చేపట్టవచ్చని అన్నారు.
గృహలక్ష్మి పథకం క్రింద జిల్లాలో తహసిల్దార్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఆగస్టు 10 వరకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి గృహలక్ష్మి క్రింద 3 వేల ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, ఇప్పటి వరకు జిల్లాలో ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులను, ఆగస్టు 10 వరకు వచ్చే దరఖాస్తుల జాబితా రూపొందించి ఆగస్టు 20 నాటికి క్షేత్రస్థాయి విచారణ పూర్తి చేయాలని సీఎస్ తెలిపారు. జిల్లా ఇంఛార్జి మంత్రిచే లబ్దిదారుల జాబితా ఆమోదింపజేసుకొని ఆగస్టు 25 నాటికి గృహలక్ష్మి ఇండ్ల మంజూరు పూర్తి చేయాలని అన్నారు.
Share your comments