ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణమైన కొబ్బరి చెట్ల కోనసీమ అందాలు ప్రస్తుతం ప్రమాదపు అంచుల్లో ఉన్నాయని కొందరు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆధునిక వ్యవసాయంలో విచ్చలవిడిగా పురుగు మందులు వాడడం వల్ల ప్రమాదకర పురుగు మందు అవశేషాలు నేల, నీరు, గాలిలో కలిసిపోవడం కారణంగా ఇప్పటికే ఆ ప్రాంతంలో పచ్చదనం చాలా మటుకు హరించుకుపోయింది.
ఇటీవల కాలంలో సముద్ర తీరప్రాంతంలో అక్రమ ఆక్వాసాగు పెరగడంతో సముద్రపు అలలు నిరంతరం ముందుకు చొచ్చుకురావడంతో ఆ ప్రాంతంలోని భూములన్నీ చౌడు భూములుగా మారాయి. దానికి తోడు ఆక్వా రంగంలో అధికోత్పత్తే లక్ష్యంగా విచ్చలవిడిగా ఎరువులు, సింథటిక్ పురుగుమందులు, యాంటిబయోటిక్స్ మోతాదుకు మించి వినియోగించడం వలన పర్యావరణ సమతుల్యం దెబ్బతిని ప్రాంతంలోని కొబ్బరి చెట్లు రోజురోజుకు క్షీణిస్తున్నాయి.
ఇప్పటికే ఈ తరహా పరిస్థితులు వేల ఎకరాల్లో
ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఆక్వా చెరువులకు ఉపయోగించే ఉప్పునీటి బోర్ల వల్ల తమ కొబ్బరితోట సర్వనాశనమైందని కొబ్బరి రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు ప్రభుత్వాలు మేల్కొని అక్రమ ఆక్వా సాగుకు అడ్డుకట్ట వేయకపోతే పచ్చటి కోనసీమ పొలాలు, కొబ్బరి చెట్లు అంతరించి ఆ ప్రాంత పర్యావరణ సమతుల్యం దెబ్బతినే ప్రమాదం ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Share your comments