రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాల నేపథ్యంలో జులై 11 నుంచి 13 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు,ఈ మేరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వర్షాభావ ప్రాంతాలు, ప్రస్తుత స్థితిగతులు, వర్షాల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను సమీక్షించేందుకు ఆయన ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం కొన్ని ప్రాంతాల్లో కురిసిన వర్షం రాత్రికి మళ్లీ జోరందుకుంది. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఇప్పటికే రిజర్వాయర్లకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టుల గేట్లు తెరిచి నీటిని దిగువకు వదిలారు.తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
తెలంగాణలోని ఈ జిల్లాలకు 'రెడ్ అలెర్ట్' హెచ్చరిక.. భారీ వర్షాలు కురిసే అవకాశం !
ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.మరో 14 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ (రూరల్), వరంగల్ (అర్బన్), జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Share your comments