ప్రస్తుతం అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములు అంతరిక్షంలో ఉన్నన్ని రోజులకు సరిపడా ఆహార పదార్థాల ఇక్కడ నుంచి తీసుకెళ్లడం మనం చూస్తున్నాము. కానీ భవిష్యత్తులో అలాంటి అవసరం ఉండదని,అంతరిక్షంలోనే వ్యోమగాములకు కావలసిన ఆహార పదార్థాలను తయారు చేసుకునే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలను ప్రారంభించారు. ఈ క్రమంలోనే అంతరిక్షంలో వ్యవసాయానికి సంబంధించి నాసాతో కలిపి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధనలను కొనసాగిస్తోంది.
ఈ పరిశోధనలలో భాగంగానే వనరులు తక్కువగా ఉండే ప్రతికూల ప్రదేశాలలో మొక్కలు పెరగడానికి అవసరమయ్యే జన్యువులను కలిగి ఉన్న పలు బ్యాక్టీరియాలను ఆవిష్కరించారు. ఈ బ్యాక్టీరియాల ద్వారా అంతరిక్షంలో వివిధ రకాల ఆహార పదార్థాలను సాగు చేయడానికి గత కొంత కాలం నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి.
నాసాకు చెందిన జెట్ ప్రొపల్సన్ ల్యాబోరేటరీ, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, వర్సిటీ ఆఫ్ హైదరాబాద్, స్కూల్ ఆఫ్ సైన్సెన్స్ సంయుక్తంగా విస్తృత అధ్యయనం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పరిశోధకులు నాలుగు బ్యాక్టీరియాలను కనుగొన్నారు. ఇందులో ఒక బ్యాక్టీరియా మిథైలో బ్యాక్టిరాయాసీకుటుంబానికి చెందినది కాగా మిగిలిన మూడు బ్యాక్టీరియాలను గతంలో ఎవరు కనుగొనలేదని తెలియజేశారు.
ఈ విధంగా కనుగొనబడిన కొత్త బ్యాక్టీరియాలలో జన్యువులు ఒత్తిడితో కూడిన పరిస్థితులను తట్టుకోవడానికి మొక్కలకు సహాయపడుతూ ఇంధనాన్ని రూపొందించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయని హైదరాబాద్ వర్సిటీ ప్రొఫెసర్ అప్పారావు పొదిలె వివరించారు. ఇది అంతరిక్షంలో వ్యవసాయం చేయడానికి మరింత దోహదపడుతుందని తెలిపారు. త్వరలోనే అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు ఇక్కడి నుంచి ఆహారం తీసుకోకుండా అక్కడే పండించడానికి అనుగుణంగా మరి కొన్ని లోతైన అధ్యయనాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
Share your comments