వ్యవసాయాన్ని వదిలి నగర బాట పడుతున్న ఈరోజుల్లో కొంతమంది యువ రైతులు వ్యవసాయం మీద మక్కువతో తమకున్న అద్భుత ప్రతిభకు పదును పెట్టి వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలు చేస్తూ అద్భుత ఫలితాలను సాధిస్తూ ఈనాటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ రోజుల్లో వ్యవసాయంలో ఎదుర్కొంటున్న కూలీల కొరత, అధిక పెట్టుబడి సమస్యను అధిగమించడానికి ఓ యువ రైతు వినూత్నంగా ఆలోచించి తనకున్న పల్సర్ బైకుతో వ్యవసాయం చేస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు.
తమ ప్రాంత వ్యవసాయ రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా కూలీల కొరత సమస్య అధికంగా ఉండటంతో నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణానికి చెందిన యువ రైతు పెండేప్ కృష్ణ మూర్తి తన ఆలోచనలకు పదును పెట్టి అందుబాటులో ఉన్న వస్తువులను ఉపయోగించి తక్కువ పెట్టుబడి, తక్కువ మంది కూలీలతో ఎక్కువ ప్రయోజనాన్ని పొందే
పల్సర్ బైక్ దుక్కి దున్నే యంత్రం, పంటకు మందు చల్లే యంత్రం అలాగే సీడ్ డ్రమ్ వంటి పనిముట్లను తయారు చేసి తనకున్న ఐదెకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాడు.
యువరైతు కృష్ణ మూర్తి సరికొత్త ప్రయోగాలతో మొదట పల్సర్ బైక్ ను ఉపయోగించి రాజస్థాన్ రాష్ట్రం నుంచి తెప్పించుకున్న ప్రత్యేకమైన యంత్రంతో పొలంలో కలుపు తీసి అందరిచేత మన్ననలు పొందాడు.తాజాగా అదే పల్సర్ బైక్ కు తాను తయారు చేసిన మందు పిచికారి యంత్రాన్ని అమర్చి తన పొలంలో సునాయాసంగా, తక్కువ సమయంలో, కూలీలు అవసరం లేకుండా పొలానికి మందు పిచికారి చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఈయంత్రం వల్ల రైతులకు సమయం, డబ్బు ఆదా అవడమే కాకుండా తమ ఆరోగ్యానికి కూడా హాని కలగదని చెబుతున్నాడు.
Share your comments