ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలు చేయలేదా? మరొక్క రోజు మాత్రమే మిగిలి ఉందని ఆందోళన చెందుతున్నారా? అయితే కేంద్ర ప్రభుత్వం కాస్త ఊరట ఇచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా ఇదివరకు పలుమార్లు ఐటీ రిటర్న్స్ గడువును పొడిగించారు.
ఐటీ రిటర్నుల దాఖలుకు సంబంధించిన గడువును కేంద్రం మరోసారి 10 రోజుల గడువు ఇచ్చింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్నులను జనవరి 10 వరకు దాఖలు చేసుకునే వెసులుబాటు కల్పించింది.. అలాగే, కంపెనీల ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును 15 రోజులు పెంచింది. ఫిబ్రవరి 15వ తేదీలోపు రిటర్న్స్ దాఖలు చేసుకునే వెసులుబాటు కల్పించింది.
అంతకుముందు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఐటీ రిటర్నుల దాఖలు గడువును డిసెంబర్ 31గానూ, కంపెనీలకు జనవరి 31గానూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్దేశించింది. గడువు సమీపించిన నేపథ్యంలో పొడిగింపు నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది డిసెంబర్ 28 వరకు 4.54 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల తెలిపింది. వివాద్ సే విశ్వాస్ గడువును కూడా జనవరి 31 వరకు పొడిగించినట్లు వెల్లడించింది.
Share your comments