గ్యాస్ బుక్ చేస్తున్నారా? అయితే మీకు తీపికబురు. గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సులభంగా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. మిస్డ్ కాల్ ద్వారా వేగంగానే సిలిండర్ బుక్ అవుతుంది.
గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కొత్త సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. మిస్డ్ కాల్ సర్వీసులు లాంచ్ చేశారు. ఎల్‌పీజీ సిలిండర్ కలిగిన వారు కేవలం ఒక్క మిస్డ్ కాల్‌తో ఇకపై సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.
ఇప్పటికే ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ కోసం నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా కామన్ మొబైల్ నెంబర్ అందుబాటులోకి తీసుకొచ్చిన ఇండేన్ గ్యాస్ తాజాగా తమ దేశవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారుల కోసం మిస్డ్ కాల్ సేవలను దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. గ్యాస్ సిలిండర్ రీఫిలింగ్ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్లు ఇకపై తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 84549 55555 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. సిలిండర్ బుక్ అవుతుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది.
పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ మిస్డ్ కాల్ ఫెసిలిటీని లాంచ్ చేశారు. ఇప్పటికే మెట్రో సిటీల్లో అందుబాటులో ఉన్న ఈ సేవలు ఇకపై దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నట్టు ఐఓసీఎల్ (IOCL) తమ ప్రకటనలో పేర్కొంది. ఈ మిస్డ్ కాల్ విధానం ద్వారా సిలిండర్ బుక్ చేసుకోవడం మరింత ఈజీ కావడంతో పాటు కాల్ చార్జీలు సైతం వర్తించవు అని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది.
Share your comments