oxygen Crisis దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చడంతో ఆస్పత్రుల్లో పడకలు దొరక్క, ఆక్సిజన్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చింది. రెండు రోజుల నుంచి మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ రోగులు సంఖ్య భారీగా పెరగడంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఆక్సిజన్ కొరతపై ఈ సమావేశంలో చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్సిజన్ కొరత రానీయవద్దని అధికారులకు ఈ సందర్భంగా మోదీ స్పష్టం చేశారు. ఆస్పత్రులకు తప్ప మరే ఇతర అవసరాలకు ఆక్సిజన్ వినియోగించరాదని వెల్లడించారు.
రాష్ట్రాల అత్యవసరాల మేరకు ప్రాణవాయువు ట్యాంకర్లను ఏయిర్ ఫోర్స్ విమానాల్లో తరలించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌ఫోర్స్ విమానాల ద్వారా ఆక్సిజన్ తరలింపు ప్రక్రియ చేపట్టారు. అత్యవసరమైన రాష్ట్రాలకు ఆక్సిజన్‌ను యుద్ధ ప్రాతిపదికన తరలిస్తున్నారు. ఆక్సీజన్ ఉత్పత్తి కేంద్రాల నుంచి పరిశ్రమలకు సరఫరా నిలిపివేసి.. ఆస్పత్రులకు తరలిస్తోంది. ఆక్సిజన్ తరలించేందుకు రైల్వేశాఖ సైతం ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతోంది
గురువారం రాత్రి విశాఖపట్టణం నుంచి మహారాష్ట్రకు తొలి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరి వెళ్లింది. మొత్తం ట్యాంకర్లను మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఈ మేరకు రైల్వే మంత్రి పీయుష్ గోయెల్ ట్వీట్ చేశారు. ‘‘ద్రవరూప మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్లతో తొలి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు బయలుదేరి వెళ్లింది. దేశంలో పౌరుల శ్రేయస్సు కోసం విపత్కర సమయాల్లో అత్యవసర వస్తువుల తరలింపును భారతీయ రైల్వే కొనసాగిస్తోంది’’ అని పీయుష్ గోయెల్ పేర్కొన్నారు
కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ఈ క్రమంలో ఏప్రిల్ 19న ముంబై సమీపంలోని కాలంబోలి స్టేషన్ నుంచి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు విశాఖపట్నానికి బయలుదేరింది. గ్రీన్ ఛానెల్‌లో 50 గంటల ప్రయాణం తర్వాత ఏప్రిల్ 22 రాత్రి 1 గంటకు విశాఖకు చేరుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో లిక్విడ్ ఆక్సిజన్‌ను మొత్తం ఏడు ట్యాంకర్లలో నింపిన అనంతరం ముంబైకి తిరిగి పయనమయ్యింది.
Share your comments