సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ శనివారం ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఉదయం 11 గంటలకు జస్టిస్ ఎన్‌వీ రమణతో రాష్ట్రపతి రామ్‌నా«థ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించిన జస్టిస్ ఎన్‌వీ రమణ ఫిబ్రవరి 17, 2014న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. నాటి నుంచి సుప్రీంకోర్టులో పలు కీలక తీర్పుల్లో భాగస్వామ్యం అయిన జస్టిస్‌ఎన్‌వీ రమణను ప్రస్తుత సీజేఐ ఎస్‌ఏ బాబ్డే తదుపరి సీజేఐగా సిఫార్సు చేయగా ఈ నెల 5న రాష్ట్రపతి కోవింద్ ఆమోదముద్ర వేసిన విషయం విదితమే. సీజేఐగా జస్టిస్ ఎన్‌వీ రమణ ఆగస్టు 26, 2022 వరకూ కొనసాగనున్నారు.
క్రమశిక్షణతోనే కరోనాను జయించగలం:జస్టిస్ ఎన్‌వీ రమణ
కరోనాను క్రమశిక్షణతోనే జయించగలమని మరికొద్ది గంటల్లో సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయనున్న జస్టిస్ ఎన్‌వీ రమణ తెలిపారు. మాస్కు ధరించడం, తరచూ చేతులు కడుక్కోవడం, అవసరం ఉంటేనే బయటకు రావడం వంటి క్రమశిక్షణ చర్యలు పాటించాలన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కష్టకాలం బలమైన వారిని సృష్టిస్తుందని, సుప్రీంకోర్టు సిబ్బంది, న్యాయమూర్తులు, న్యాయవాదుల్లో కూడా కరోనా బాధితులున్నారని తెలిపారు.
మూడేళ్లపాటు ఉండాలి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం మూడేళ్లపాటు ఉండాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. సీజేఐ పదవీ విరమణ కార్యక్రమం ఎప్పుడూ విచారకరమేనన్నారు. కరోనా నేపథ్యంలో వర్చువల్ విచారణల ద్వారా సుప్రీంకోర్టులో సుమారు 50వేల కేసులు విచారణ ముగించడం గొప్ప అచీవ్‌మెంట్‌గా కేకే వేణుగోపాల్ అభివర్ణించారు
సంతృప్తిగా ఉంది..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తన వంతు కృషి చేశానన్న సంతృప్తితో ఉన్నానని జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే అన్నారు. శుక్రవారం కోర్టు హాలులో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో చాలా క్లుప్తంగా మాట్లాడారు. బాధ్యతలను జస్టిస్ ఎన్‌వీ రమణకు అప్పగిస్తున్నానని, సమర్థంగా కోర్టును నడిపిస్తారన్న విశ్వాసం ఉందని జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే అన్నారు.
Share your comments