హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి గురువారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించిన జస్టిస్ హిమా కోహ్లి బదిలీపై తెలంగాణ సీజేగా నియమితులైన విషయం తెలిసిందే.
దేశంలో 78 మంది మహిళలు న్యాయమూర్తులు..
దేశంలోని హైకోర్టుల్లో 78 మంది మహిళలు న్యాయమూర్తులుగా పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టులో జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1991లో దేశంలో హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ లీలాసేథ్ రికార్డు సృష్టించారు. ఆమె హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అనంతరం జస్టిస్ సుజాతా మనోహర్ (1994), జస్టిస్ కె.కె.ఉష (2001), జస్టిస్ మంజులా చెల్లూర్ (2014) కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా బాధ్యతలు నిర్వర్తించారు. సుజాతా మనోహర్ ఆ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ మంజుల చెల్లూర్ ప్రతిష్ఠాత్మకమైన బాంబే, కోల్‌కతా హైకోర్టులకు కూడా సారథ్యం వహించారు. ఝార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జ్ఞాన సుధామిశ్రా పనిచేశారు. ఆమె పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఏపీకి చెందిన జస్టిస్ రోహిణి దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. అంతకుముందు ఆమె ఉమ్మడి ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018లో జస్టిస్ గీతామిట్టల్ జమ్ము-కశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
Share your comments