దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కోరలు చాచుతోంది. సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చుతోంది. దీంతో ప్రజల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం లాంటివి మళ్లీ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఇప్పటికీ కోవిడ్ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా రోజువారీ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రోజూ లక్షకుపైగా కేసులు నమోదవుతున్నాయి.
ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా ఉంటుందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాబోయే నాలుగు వారాలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. గతంలో కంటే ఇప్పుడు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది.
దీంతో పలు రాష్ట్రాలు మళ్లీ ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూతో పాటు వీకెండ్ లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర రాత్రి కర్ఫ్యూతో పాటు వీకెండ్ లాక్‌డౌన్ విధించగా.. పంజాబ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ రాత్రి కర్ఫ్యూ విధించాయి. అలాగే బహిరంగ సమావేశాలపై నిషేధం విధించాయి.
అయితే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తుండటం, మళ్లీ లాక్‌డౌన్ విధించే అవకాశముందనే వార్తల నేపథ్యంలో వలస కూలీలలో టెన్షన్ మొదలైంది. తమ బ్రతుకుతెరువు ఎలా అనే ఆందోళన వారిలో మొదలైంది. ఈ క్రమంలో తిరిగి సొంతూళ్లకు చేరుకుంటున్నారు. ఇప్పుటికే ముంబైతో పాటు ఢిల్లీ, ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలు సొంతూళ్లకు చేరుకుంటున్నారు.
అయితే గత ఏడాదిలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా లాక్‌డౌన్ విధించడంతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పిల్లలతో రోడ్లపై నడుచుకుంటూ వెళుతున్న ఫొటోలు అందరినీ కలిచివేశాయి. దీంతో ప్రభుత్వాలు ఆలస్యంగా స్పందించి వలస కూలీలను ఇంటికి పంపించేందుకు స్పెషల్ ట్రైన్లు, బస్సులు ఏర్పాటు చేశారు.
కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్లీ పట్టణాలు, నగరాలకు చేరుకుని కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు వలస కూలీలు. ఇప్పుడు మళ్లీ రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తుండటంతో.. ముందు జాగ్రత్తగా తమ సొంతూళ్లకు చేరుకుంటున్నారు.
Share your comments