సామాన్య, మధ్యతరగతి, సంపన్నులు.. ఇలా ఎవరైనా సరే. పొద్దున్నే లేవగానే తాగే టీ నుంచి రాత్రి భోజనంలో తినే పెరుగు వరకు పాల ఉత్పత్తులను రోజూ తప్పనిసరిగా వాడతారు. రోజుకు ఒక పాల ప్యాకెట్ అయినా తప్పనిసరిగా ఇంట్లో ఉపయోగించాల్సిందే. పాలు లేనిది వంటిట్లో పని జరగదు. అంతగా పాలు చాలా ముఖ్యం.
అయితే ఇప్పుడు పాలు కూడా భారం కానున్నాయట. త్వరలో పాల ధరలు పెరిగే అవకాశముందని వార్తలొస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ పెరిగిన తరుణంలో పాల ధరలను కూడా పెంచేందుకు డెయిరీలు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. డీజిల్ ధరలు పెరగడంతో.. డెయిరీ కంపెనీలు పాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంకు సరఫరా చేయడానికి రవాణా ఖర్చు పెరిగింది.
ఈ క్రమంలో పాల ధరలను పెంచాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మార్కెట్‌లో లీటర్ పాల ధర రూ.60 వరకు ఉంది. దీంతో లీటర్ పాలపై రూ.2 వరకు పెంచే అవకాశముంది. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లోని రాట్లం సిటీలో 25 గ్రామాలకు చెందిన పాల ఉత్పత్తిదారు సంఘాలు లీటర్ పాల ధరపై రూ.12 పెంచాలని నిర్ణయించాయి.
మార్చి 1 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. ప్రస్తుతం అక్కడ లీటర్ పాల ధర రూ. 43 ఉంది. ఇప్పుడు ఈ పెంపుతో రూ.52కి చేరుకోనుంది. పాల ధర ఎప్పుడో పెంచాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా వేయాల్సి వచ్చిందని పాల ఉత్పత్తి సంఘాలు చెబుతున్నాయి. ఇప్పుడు డీజిల్ ధరలు పెరగడంతో పెంచక తప్పలేదని చెబుతున్నాయి. కాగా డీజిల్ రేటు పెరగడంతో దేశవ్యాప్తంగా కూడా పాల ధరలు పెరిగే అవకావముంది.
Share your comments