పేద, మధ్య తరగతి వర్గాలవారికి గృహ వసతి కల్పించేందుకు మన దేశం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
ఆరు రాష్ట్రాల్లో లైట్ హౌస్ ప్రాజెక్టుల కోసం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించడం సహకారాత్మక సమాఖ్య విధానాన్ని బలోపేతం చేయడమేనని చెప్పారు.
లైట్ హౌస్ ప్రాజెక్టు కింద ఇళ్ల నిర్మాణానికి చాలా తక్కువ సమయం పడుతుంది. సరసమైన ధరలో, సౌకర్యవంతంగా ఉండనున్నాయి. ఆధునిక గృహనిర్మాణ సాంకేతికతలో పరిశోధన, స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు దేశంలో ఆశా-ఇండియా కార్యక్రమం చేపట్టాం. ఒకానొక సమయంలో గృహనిర్మాణ ప్రణాళికలు కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యాల్లో లేవు. అప్పటి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత వంటి కీలక సమాచారాన్ని పట్టించుకోలేదు. ఆ ఆలోచనల్లో మార్పు రాకపోతే.. అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ప్రస్తుతం దేశం ప్రత్యేక పద్దతిని అవలంబిస్తోంది."
ఇండోర్, రాజ్‌కోట్, చెన్నై, రాంచీ, అగర్తల, లక్నోలలో వచ్చే సంవత్సరం జనవరి 26నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని, ఒక్కొక్క సైట్‌లో 1,000 ఇళ్ల చొప్పున నిర్మితమవుతాయని తెలిపారు. వివిధ విశ్వవిద్యాలయాలు, సంస్థలలో చదువుతున్న విద్యార్థులకు ఈ నిర్మాణ కేంద్రాలు బోధనా కేంద్రాలుగా ఉపయోగపడతాయన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకునేందుకు విద్యార్థులు ఈ సైట్లకు వెళ్లవచ్చునని తెలిపారు. స్థానిక అవసరాలకు తగిన విధంగా వాటిని తీర్చిదిద్దవచ్చునని తెలిపారు.
Share your comments