రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు బంధు పథకం యొక్క నిధులను కొందరు అక్రమార్కులు పక్కదోవ పట్టిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతుబంధు పథకం నిధులను పొందుతూ ఉన్న రైతులు చనిపోతే, వారి భూముల వివరాలను మార్చి, వేరే బ్యాంకు ఖాతాలు లింక్ చేసి వారికి వచ్చే డబ్బులను దోచేస్తున్నారు. తాజాగా నల్లగొండ జిల్లా చందంపేట మండలం కొందరు వ్యవసాయ అధికారులు మరియు దళారులు కలిసి రైతుబంధు నిధులను కాజేస్తున్న విషయం బయటకి వచ్చింది.
ప్రతిసారి ప్రభుత్వం భూములు ఎవరి పేరు మీద ఉంటే రైతు బంధు డబ్బులను వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి చనిపోతే కనుక, ఆ వ్యక్తి వారసులు భూమిని తన పేరు మీద మార్చుకుని రైతు బంధుకు దరఖాస్తు చేసుకుంటారు. అధికారులు ఆ దరఖాస్తులను పరిశీలించి చనిపోయిన వ్యక్తి స్థానంలో వారసుల పేరు, బ్యాంకు ఖాతా నంబర్ను లింక్ చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల ఆ కుటుంబ వారసులు రైతు బంధు నిధులను పొందుతారు.
అయితే చందంపేట మండల పరిధిలో వ్యవసాయ శాఖ అధికారులు, కొందరు దళారులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. అక్కడి వ్యవసాయ అధికారులు దళారుల బ్యాంకు ఖాతా నంబర్లను మరణించిన వారి భూముల వివరాలకు అనుసంధానం చేశారు. సుమారుగా లక్షల రూపాయలు ఆ బ్యాంక్ ఖాతాల్లో పడ్డాయి. వాటన్నిటిని కాజేశారు. ఈ అక్రమాలు సుమారుగా మూడేళ్ళ నుండి జరుగుతున్నాయి.
ఇది కూడా చదవండి..
కొత్త రేషన్ కార్డుల జారీపై క్లారిటీ ఇచ్చిన మంత్రి
ముదుదండ్ల గ్రామంలో బొజ్జ జంగమ్మ అనే మహిళకు 4.09 ఎకరాల భూమి ఉంది. ఆమెకు సంవత్సరానికి రూ. 45,000 రైతు బంధు డబ్బులు ఆమె బ్యాంకు ఖాతాలో జమ అయ్యేవి. అయితే విషాదకరంగా రెండేళ్లకే జంగమ్మ కన్నుమూసింది. రెండేళ్ల కింద ఆమె చనిపోయింది. కుటుంబ సభ్యులు భూమిని తమపేరిట మార్చుకోలేదు, జంగమ్మ చనిపోయిన విషయం తెలిసి ప్రభుత్వమే ఆపేసిందేమో అనుకున్నారు. తరువాత అనుమానంతో ఆరాతీస్తే, వ్యవసాయ శాఖ ఆన్లైన్ చేసిన రికార్డుల్లో బ్యాంకు ఖాతా నంబర్ మార్చేసిన విషయం బయటపడింది.
ఈ విషయం బయట పడడంతో అక్రమార్కులు లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అక్రమార్కులు వారికి డబ్బులు ఇచ్చి ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. వ్యవసాయ పాలకవర్గం మండల స్థాయిలో పనిచేస్తున్న అధికారులే అక్రమాలకు పాల్పడినట్లు వెల్లడి కావడం ఈ పరిస్థితిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
ఇది కూడా చదవండి..
Share your comments