వర్గాలు, రంగాల వారీగా ఏపీ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. రైతుల కోసం రైతు భరోసా, ఉచిత పంట బీమా, ఉచితంగా బోర్లు లాంటి పథకాలు ప్రవేశపెట్టగా.. సామాజిక వర్గాల వారీగా అనేక పథకాలు అమలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందిన వారికి ఉచిత విద్యుత్‌తో పాటు పలు పథకాలను తీసుకొచ్చింది.
ఇక విద్యార్థుల కోసం జగనన్న విద్యాదీవెన పథకాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకానికి సంబంధించిన డబ్బులను ఈ నెల 16న ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వీటిని నేరుగా జమ చేయనుంది.
ఏప్రిల్ 9నే వీటిని జమ చేయాల్సి ఉంది. కానీ డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ తొలి ఏడాది విద్యార్థుల దరఖాస్తు పూర్తి కాలేదు. దీంతో వాయిదా వేసి ఈ నెల 16న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను నేరుగా కాలేజీలకు ఇచ్చేవారు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిబంధనలను మార్చింది. నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తుంది. అలాగే విద్యార్థుల హాస్టల్ ఫీజు కోసం జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకానికి సంబంధించిన డబ్బులను ఏప్రిల్ 27న చెల్లించే అవకాశముంది.
జగనన్న విద్యాదీవెన పథకానికి అర్హతలు ఏంటి?
-కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలకు మించి ఉండకూడదు
-విద్యార్థి కుటుంబానికి మాగాణి 10 ఎకరాలలోపు, లేదా మెట్ట, మాగాణి కలిపి 25 ఎకరాలలోపు మాత్రమే ఉండాలి
-టౌన్‌లో 1500 చదరపు అడుగులకు మించి ఇళ్లు ఉండకూడదు
-కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం, ఇన్ కం ట్యాక్స్ చెల్లించేవారు ఉండకూడదు
-ఇక కన్వీనర్ కోటాలో కౌన్సిలింగ్ ద్వారా సీటు వచ్చినవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు
విద్యాదీవెనకు ఎలా అప్లై చేసుకోవాలి?
-జ్ఞానభూమి వెబ్ సైట్‌లోకి వెళ్లి విద్యార్థులు అప్లై చేసుకోవాలి
-సంబందింత వివరాలు, దరఖాస్తుకు కావాల్సిన గుర్తింపు పత్రాలు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
-విద్యార్థులు కాలేజీలో చేరిన 20 రోజుల్లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసేలా కాలేజీ యాజమాన్యాలు చూసుకోవాలి.
Share your comments