ఉల్లిగడ్డల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఆకాల వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో ఉల్లి పంటకు నష్టం జరిగినందువల్ల డిమాండ్ పెరగడంతో కొరత ఏర్పడింది. దీంతో ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి. రెండు రోజుల క్రితం కేజీ ఉల్లి ధర రూ.50గా ఉంది. కానీ ప్రస్తుతం రూ.25 పెరిగి రూ.75కి చేరుకుంది. మరికొన్ని చోట్ల కేజీ ఉల్లి రూ.80కి విక్రయిస్తున్నారు.
ఇక చిన్న ఉల్లిపాయల ధర కేజీ రూ.50 నుంచి రూ.55 వరకు ఉన్నాయి. దేశంలోని అతిపెద్ద హోల్‌సేల్ ఉల్లి మార్కెట్ లాసల్‌గావ్‌లో ఉల్లి టోకు రేటు గత 10 రోజుల్లో 15 శాతం నుంచి రూ.20 శాతానికిపైగా పెరిగింది. మరికొద్దిరోజుల్లో ఉల్లి ధర మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పట్లో ఉల్లి ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపారులు చెబుతున్నారు. వచ్చే నెలలో కాస్త తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ప్రస్తుతం కేజీ ఉల్లి రూ.40 నుంచి రూ.50 వరకు ఉంది. రానున్న రోజుల్లో ఈ ధర మరింత పెరిగే అవకాశముంది. అయితే ఉల్లి ధరలను అదుపులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రయత్నాలు చేస్తోంది.
Share your comments