మొన్నటి వరకు టమోటా ధరలు భారీగా పెరిగి సామాన్యులకు చుక్కలు చూపించాయి. ఇది ఇలా ఉండగా, ప్రస్తుతం ఉల్లిపాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పుడు పెరుగుతున్న ఉల్లి ధరలే సామాన్య ప్రజలను కంటతడి పెట్టిస్తున్నాయి. ఉల్లిపాయల ధర పెరిగితే మన వంటింట్లో బడ్జెట్ కూడా పక్కాగా పెరుగుతుంది. ఈ విషయం ఎవరు కాదనలేని సత్యం. అటువంటి ఉల్లి ధరలు ఇప్పుడు చుక్కల్ని తాకుతున్నాయి.
హైదరాబాద్ నగరంలో, ఉల్లిపాయల ప్రస్తుత మార్కెట్ ధర కిలోగ్రాముకు 70 రూపాయలుగా ఉంది, ధరల పెరుగుదల గురించి జనాభాలో ఆందోళనలు మరియు భయాలు ఉన్నాయి. కొన్నాళ్ల క్రితమే టమాటా కిలో 200 రూపాయలకు పైగా ధర పలికింది. అయితే తాజాగా టమాటా ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టినప్పటికీ, ఉల్లి ధర క్రమంగా పెరగడం ప్రారంభించింది.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పండుగల సీజన్ దీపావళి రాకతో ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. దురదృష్టవశాత్తు, దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్‌గా పేరుగాంచిన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు ఉల్లి పంటను తీవ్రంగా ప్రభావితం చేశాయి. దీనివల్ల మార్కెట్లో ఉల్లి కొరత కనిపిస్తుంది.
ఇది కూడా చదవండి..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలనాత్మక నిర్ణయం.. వారికి 4 శాతం రిజర్వేషన్!
డిమాండ్ కు తగ్గట్టుగా సప్లై లేకపోవడంతో ధరలు అమాంతం పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక బెంగళూరులో ఉల్లి ధరలు 50 శాతానికి పైగా పెరిగాయి. ఈ సంవత్సరం ఉల్లి పంటకు అకాల వర్షాలు, అనావృష్టి రెండు దెబ్బ తీయడంతో ధరల పెరుగుదల కనిపిస్తుంది. మరొకవైపు, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాల్లో తగినంత వర్షపాతం లేకపోవడంతో కర్నూలు, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, మెదక్, చేవెళ్ల వంటి ప్రాంతాల్లో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది.
ఈ పరిస్థితులతో ఉల్లి ధరలు మునుపెన్నడూ లేని స్థాయిలో విపరీతంగా పెరిగిపోయాయని అంచనా వేస్తున్నారు. దీపావళి పండుగ సమయంలో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి నవంబర్ రెండవ వారానికి ఖరీఫ్ పంట అందుబాటులోకి రానుండడంతో మళ్లీ ఉల్లి ధరలు తగ్గే అవకాశం ఉన్నట్టు అభిప్రాయపడుతున్నారు. రోజువారీ వంటలో ఉల్లిపాయల యొక్క అనివార్య పాత్రను దృష్టిలో ఉంచుకుని, అధిక ధరలను నియంత్రించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి.
ఇది కూడా చదవండి..
Share your comments