పి.ఎం.కిసాన్ పథకం కింద లబ్ధి పొందిన 42 లక్షల మంది రైతులను ఒక్కసారిగా తన నిర్ణయంతో సందిగ్ధం లోకి నెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఈ పథకం కింద లబ్ధి పొందిన రైతుల్లో 42 లక్షల మందిని అనర్హులుగా ప్రకటించి వారినుండి సుమారుగా 3000 కోట్లు రికవరీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లిమెంట్లో ప్రస్తావించింది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.6వేలు రైతులకు అందిస్తోంది. దేశవ్యాప్తంగా రైతులకు మూడు ఈక్వల్ ఇన్ స్టాల్ మెంట్స్ అందిస్తోంది. ఈ స్కీమ్‌కు రైతులు అర్హత సాధించాలంటే కొన్ని అర్హతలు అవసరం.. పీఎం కిసాన్ స్కీమ్ కింద 42.16 లక్షల మంది అనర్హులైన రైతుల నుంచి రూ.2,992 కోట్లు రికవరీ చేయనున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పార్లమెంటుకు వెల్లడించారు.
పీఎం కిసాన్ నుంచి అక్రమంగా నగదు పొందిన రైతుల్లో గరిష్ట సంఖ్య అస్సాం రాష్ట్రంలోనే 8.35 లక్షలు.. తమిళనాడులో 7.22 లక్షలు ఉండగా.. పంజాబ్ 5.62 లక్షలు, మహారాష్ట్రలో 4.45 లక్షలు, ఉత్తరప్రదేశ్ 2.65 లక్షలు, గుజరాత్ 2.36 లక్షల మంది ఉన్నారు. స్వాధీనం చేసుకోవలసిన నగదు అస్సాంలో రూ.554 కోట్లు కాగా.. పంజాబ్ లో రూ.437 కోట్లు, మహారాష్ట్రలో రూ.358 కోట్లు, తమిళనాడులో రూ.340 కోట్లు, యూపీలో రూ.258 కోట్లు, గుజరాత్‌లో రూ.220 కోట్లు రికవరీ చేయాల్సి ఉందని తెలిపారు. పీఎం కిసాన్ నిధులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. చాలా రాష్ట్రాలు అనర్హులైన రైతుల నుంచి నగదును రికవరీ చేసేందుకు నోటీసులు పంపినట్టు తెలిపారు.
Share your comments