గత నాలుగేళ్లలో ధరలను మించి ఈ ఏడాది సన్న బియ్యం ధర అనూహ్యంగా పెరిగింది. ప్రత్యేకించి ప్రస్తుతం క్వింటా బీపీటీ బియ్యం కొత్తవి రూ.5,000, పాతవి రూ.5,500గా ఉంది. అదనంగా, చిట్టి పొట్టి మరియు చింతలు రకాలు రూ.6,300 కంటే ఎక్కువగా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కొత్త బిపిటి బియ్యం క్వింటాల్‌కు రూ.3,300 నుంచి రూ.3,700 వరకు ఉండగా, పాతవి రూ.4,000 నుంచి రూ.4,500 వరకు ఉన్నాయి. ధరలు ఒకేసారి రూ.వెయ్యికిపైనే అదనంగా పెరిగాయి.
ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల లేకపోవడం, నీటి వనరులు సరిపడా లేకపోవడంతో సన్నాల సాగు తగ్గింది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో సాగు విస్తీర్ణం 3.20 లక్షల ఎకరాల నుంచి 1.73 లక్షల ఎకరాలకు తగ్గింది. దీనికి తోడు యాసంగిలో సాగుకు తీవ్ర కొరత ఏర్పడింది. మళ్లీ వానకాలం వరకు గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ఈ నేపథ్యంలో కొంత మంది ముందస్తుగా బియ్యం కొని పెట్టుకున్నట్లు తెలుస్తున్నది.
ప్రస్తుతం సన్న బియ్యం మార్కెట్‌లో అంచనాలకు మించి ధరలు పెరుగుతున్నాయి. గత నాలుగైదు సంవత్సరాలుగా వర్షాకాలంలో వంద కిలోల బియ్యాన్ని రూ.3,000 నుంచి రూ.3,500 వరకు ధరలకు మిల్లుల్లో సాధారణంగా కొనుగోలు చేసేవారు. అయితే ఈ ఏడాది ధరలు గణనీయంగా పెరగడంతో మార్కెట్‌లో గతంలో భిన్నంగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. రైస్ దుకాణాలతో పాటు మిల్లుల్లో ప్రస్తుతం బీపీటీ కొత్త బియ్యం క్వింటా రూ.4800 నుంచి రూ.5వేల వరకు అమ్ముతుండగా.. పాతవి (గత వానకాలం) రూ.5500కు పైగా అమ్ముతున్నారు.
ఇది కూడా చదవండి..
రాష్ట్రంలో మరోసారి వర్షాలు.. హెచ్చరించిన వాతావరణ శాఖ..!
జిల్లాలో ఈ సారి సన్న బియ్యం ధరలు అమాంతం పెరుగడానికి పలు కారణాలు ఉన్నాయి. సాధారణంగా రైతులు ఎక్కువగా వానకాలం సీజన్‌లోనే సన్న వడ్లు సాగు చేస్తుంటారు. అయితే.. ఈ వానకాలంలో జిల్లాలో సన్న ధాన్యం సాగు గణనీయంగా తగ్గినట్లు వ్యవసాయ శాఖ యంత్రాంగం అంటున్నది. గత ఏడాది జిల్లాలో 5.04 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, అందులో 3.20 లక్షల (63శాతం) ఎకరాల్లో సన్న రకాలు సాగు చేశారు.
ఈ ఏడాది 5.05 లక్షల ఎకరాల్లో వరి సాగు అయినప్పటికీ అందులో 1.73 లక్షల ఎకరాల్లో (32శాతం) మాత్రమే సన్న రకం ధాన్యం సాగు చేశారు. గత ఏడాది వానకాలం సీజన్‌తో పొలిస్తే ఈ ఏడాది 31శాతం సన్న ధాన్యం సాగు తక్కువగా అయ్యింది. సాగు నీటి వనరుల కొరతే ఇందుకు కారణంగా తెలుస్తుంది. సన్న వరి సాగు కాలం కంటే దొడ్డు రకాల సాగు సమయం తక్కువ ఉండటం, నీటి వనరుల కొరతతో రైతులు తక్కువగా వేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments