వానాకాలం పంటలకు కావాల్సిన విత్తనాలు సిద్దం చేయాలని అధికారులను తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వానాకాలం పంటల సాగు, సరిపడ విత్తనాలు అందుబాటులో ఉంచడంపై అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులతో నిరంజన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. మే 15 నాటికి అన్ని జిల్లాలకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేస్తామని, రైతులకు సరిపడ అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వానాకాలంలో కంది, పత్తి, నూనెగింజలు సాగు చేస్తే మేలని రైతులకు ఆయన సూచించారు. వరి సాగును పక్కనపెట్టి జాతీయ, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న పప్పు దినుసులు, నూనె గింజలను సాగు చేయాలన్నారు. ఈ విషయాన్ని అధికారులు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతులు వానకాలంలో 20 లక్షల ఎకరాల్లో కంది, 75 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేసేలా చూడాలని అధికారులకు చెప్పారు. దీని కోసం 80 వేల క్వింటాళ్ల కంది విత్తనాలు, 1.70 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లను సిద్ధం చేయాలని సూచించారు. దీని కోసం విత్తన కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామన్నారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో క్యూ ఆర్ కోడ్, సీడ్ ట్రేసబిలిటీతో నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచనున్నామని నిరంజన్ రెడ్డి తెలిపారు.
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామని, నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్‌తో పాటు రైతుబంధు, రైతు బీమా పథకాల ద్వారా తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరుగుతుందన్నారు.
పత్తి సాగు మీద జిల్లాల వారీగా సర్వే నిర్వహించి కార్యచరణ రూపొందించామన్నారు. కాగా ఈ కార్యక్రమంలో విత్తనాభివృద్ది సంస్థ డైరెక్టర్ కేశవులు, జేడీఎ బాలు, డీడీఎ శివప్రసాద్, విత్తన కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Share your comments