ఈ రోజుల్లో వ్యవసాయదారులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో కూలీల కొరత, కలుపు సమస్య ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. వ్యవసాయంలో కూలీల కొరత అధికంగా ఉండడంతో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంటల్లో సరైన సమయానికి కలుపు నివారణ చర్యలు చేపట్టకపోవడం వల్ల పంట దిగుబడిపై తీవ్రప్రభావం చూపి ప్రతి సంవత్సరం రైతు సోదరులు నష్టపోవాల్సి వస్తోంది. పంట పెట్టుబడిలో కలుపు తీయడానికి దాదాపు 10 నుంచి 15 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో రైతుల పై మరింత ఆర్ధిక భారం పడుతోంది.
రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాలుగా కృషి చేసి కలుపు సమస్యను అధిగమించడానికి ఎక్స్-మిషన్స్ అనే అంకుర సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పరిజ్ఞానంతో మొబైల్ రోబో ను రూపొందించింది.తాజాగా ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అగ్రిహబ్ లో ఈ రోబోను మొక్కజొన్న పైరులో ప్రయోగించి చూశారు. మొక్కజొన్న సాళ్ల మధ్య రోబోను వదిలితే మొక్కజొన్న మొక్కలను వదిలేసి ఇతర కలుపు మొక్కల పైన మాత్రమే కలుపు నివారణ మందులు పిచికారి అద్భుత ఫలితం సాధించింది.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పరిజ్ఞానంతో రూపొందించిన మొబైల్ రోబో సాఫ్ట్ వేర్‌ను మన మొబైల్ ఫోన్ తో కనెక్ట్ చేసి ఆపరేట్ చేయవచ్చు అలాగే ఈ రోబోను ఉపయోగించి మొక్కజొన్న తో పాటు పత్తి, జొన్న,వేరుశెనగ వంటి రకరకాల పంటల్లో కలుపు నివారణ చేయుటకు ఇంకా కొన్ని ప్రయోగాలు చేయవలసి ఉంటుంది. వీలైనంత త్వరగా ఈ పరికరాన్ని రైతులకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
Share your comments