రైతులకు పెట్టుబడి సాయంగా తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు అనే పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎకరానికి రూ.5 వేల చొప్పున ఏడాదిలో రెండుసార్లు ఇస్తోంది. మొత్తం ఎకరానికి సంవత్సరానికి రూ.10 వేలు పెట్టుబడి సాయం అందిస్తోంది. వీటిని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ప్రస్తుత సీజన్‌కి సంబంధించి రైతుబంధు సాయాన్ని రైతుల బ్యాంకు అకౌంట్లో ప్రభుత్వం జమ చేస్తోంది.
రైతుబంధు సాయాన్ని రైతులు బ్యాంకులకు వెళ్లి నేరుగా తీసుకోవచ్చు. ఇక ఏటీఎం కార్డు కలిగి ఉంటే సమీపంలోని ఏటీఎం సెంటర్‌కి వెళ్లి తీసుకోవచ్చు. అయితే ఇక నుంచి పోస్టాఫీసుల ద్వారా కూడా రైతుబంధు డబ్బులను తీసుకోవచ్చు. తాజాగా పోస్టల్ శాఖ ఈ సదుపాయాన్ని కల్పించింది. ఈ విషయాన్ని తపాలశాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస్ తాజాగా వెల్లడించారు.
ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండానే రైతుబంధు సాయాన్ని రైతులు పోస్టాఫీసుల ద్వారా తీసుకోవచ్చు. ఇక తెలంగాణవ్యాప్తంగా 5,794 పోస్టాఫీసుల్లో మైక్రో ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయి. ఆధార్ కార్డుతో, బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటే, ఈ మైక్రో ఏటీఎంల ద్వారా డబ్బులు తీసుకోవచ్చు. రైతులు ఆధార్ కార్డుతో పాటు ఆధార్ తో లింక్ అయిన మొబైల్ ను తీసుకెళ్లి డబ్బులు తీసుకోవచ్చు.
వేలిముద్ర సాయంతో మైక్రో ఏటీఎంలలో రోజుకు రూ.10 వేలు తీసుకోవచ్చని పోస్టల్ శాఖ వెల్లడించింది. రబీ సీజన్‌లో 1.73 లక్షల మంది రైతులకు రూ.169 కోట్ల రైతుబంధు నగదును అందించినట్లు తెలిపింది. పోస్టాఫీసుల్లో రైతుబంధు డబ్బులను తీసుకునే సదుపాయం కల్పించడం వల్ల.. రైతులు పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. నేరుగా తమ గ్రామంలోని పోస్టాఫీసులోనే డబ్బులు తీసుకోవచ్చు.
బ్యాంకులు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. బ్రాంచ్ కి వెళితే డబ్బులు తీసుకోవాలంటే గంటలకొద్ది క్యూలో నిల్చోవాల్సి వస్తుంది. ప్రస్తుతం కరోనా సమయం కావడంతో.. బ్యాంకుకు వెళ్లి డబ్బులు తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో చాలామంది బ్యాంకులకు వెళ్లడం మానేశారు. ఆన్ లైన్, ఏటీఎం సేవలను ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. రైతులకు ఆన్ లైన్ బ్యాంకింగ్ మీద ఎక్కువ అవగాహన ఉండదు. అందుకే పోస్టాఫీస్ ద్వారా సులువుగా మీ గ్రామంలోనే రైతుబంధు డబ్బులు తీసుకోవచ్చు.
Share your comments