బిఆర్ఎస్ పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు తమ అభ్యర్థులను అందరి కంటే నాలుగు నెలల ముందుగానే ప్రకటించింది. ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా బిఆర్‌ఎస్ ఇప్పుడు తన సమగ్ర మేనిఫెస్టోను పోటీదారుల కంటే ముందు ఆవిష్కరించడానికి సిద్ధమవుతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మేనిఫెస్టోను ఈ నెల 16వ తేదీన వరంగల్ నగరంలో నిర్వహించే కార్యక్రమంలో అధికారికంగా విడుదల చేయనున్నారు.
మరొకవైపు, ఆరు గ్యారెంటీలు మరియు డిక్లరేషన్ల ద్వారా ప్రజల ఆదరాభిమానాలు పొందేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా.. అప్రమత్తమైన సీఎం కేసీఆర్ అస్త్రాలను బయటకు తీయనున్నట్లు సమాచారం. హ్యాట్రిక్ విజయం సాధించాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని అడ్డంకులు ఎదురైనా బీఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలనే పట్టుదలతో ఉన్నారు.
ఈ లక్ష్య సాధనలో రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ముమ్మరంగా కృషి చేస్తోంది. వ్యూహాత్మక చర్యగా, రాబోయే ఎన్నికలకు అభ్యర్థులను నాలుగు నెలల ముందుగానే ప్రకటించడం జరిగింది, తద్వారా వారు అట్టడుగు స్థాయిలో ప్రజలతో మమేకమయ్యేందుకు తగినంత సమయాన్ని వెచ్చిస్తున్నారు.
ఈ అభ్యర్థులు, BRS పార్టీకి మరోసారి అధికారం ఇస్తే చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి ఓటర్లకు అర్ధం అయ్యేలా వివరిస్తున్నారు. ఇదిలా ఉంటే కర్నాటక ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర కాంగ్రెస్లో జోష్ పెరిగింది. ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారిస్తున్న కొద్దీ తమకు అధికారం దక్కుతుందన్న నమ్మకం మరింత బలపడిందని కాంగ్రెస్ పార్టీ తెలుపుతుంది.
ఇది కూడా చదవండి..
గుడ్ న్యూస్.. నేటినుండి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అల్పాహారం..! ఆరు రోజులు..ఆరు రకాలు..
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్న అంశాలపై కాంగ్రెస్ పార్టీ జనానికి స్పష్టత ఇస్తోంది. ఈ క్రమంలోనే అన్ని వర్గాలను ఆకట్టుకునేలా కాంగ్రెస్ పలు డిక్లరేషన్లు ప్రకటించింది. అధికారంలోకి వస్తే అమలు చేసే ఆరు గ్యారెంటీలను ప్రజల ముందుంచింది.
గ్రామీణ ప్రాంత ప్రజలకు మేలు చేసే లక్ష్యంతో సీఎం కేసీఆర్ కొత్త పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. వృద్ధాప్య పింఛను మొత్తాన్ని పెంచడమే కాకుండా ప్రతినెలా ఆరు సిలిండర్లను ఉచితంగా అందించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. అదనంగా, ముఖ్యమంత్రి ప్రత్యేకంగా రైతుల కోసం ప్రత్యేక పింఛను పథకాన్ని ఆవిష్కరిస్తారని, ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని భావిస్తున్నారు.
కాగా, మహిళల ఆర్థిక స్వాతంత్య్రాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో వారికి నెలకు రూ.3 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని బీఆర్‌ఎస్ నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. అక్టోబర్ 16న విడుదల కానున్న మేనిఫెస్టోలో ఈ పథకాలను ఇప్పటికే చేర్చినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి..
Share your comments