తెలంగాణలో మళ్లీ కరోనా మహమ్మారి భయపెడుతోంది. గత వారం నుండి కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి .రోజుకు 150కి పైగా కేసులు నమోదవుతున్నాయి. మరో రెండు, మూడు వారాలక వరకు కొవిడ్ విజృంభణ ఉంటుందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ ప్రకటించారు. ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
కొవిడ్ కేసులు పెరుగుతుండటం, హెల్త్ డైరెక్టర్ ప్రకటనతో తెలంగాణ జనాల్లో ఆందోళన నెలకొంది. అదే సమయంలో జూన్ 13 నుంచి విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి. కొవిడ్ కేసులు పెరుగుతున్నందున తమ పిల్లలను స్కూల్ కు పంపాలా వద్దా అన్న ఆందోళనలో తల్లీ తండ్రులు ఉన్నారు. స్కూళ్ల సెలవులు పొడిగిస్తున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. స్కూల్ సెలవులను పొడిగించబోతున్నారని.. ఆదివారం సాయంత్రం వరకు విద్యాశాఖ నుంచి ప్రకటన వస్తుందనే ప్రచారం సాగింది.
స్కూళ్ల పొడిగింపుపై వస్తున్న వార్తలపై తెలంగాణ విద్యాశాఖ స్పందించింది. విద్యాసంస్థల పున ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. షెడ్యూల్ ప్రకారమే జూన్13 నుంచి స్కూళ్లు తెరుచుకుంటాయని ప్రకటించారు . వేసవి సెలవులు పొడిగిస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నా.. అంతగా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు విద్యాశాఖ అధికారులు. పలు జాగ్రత్తలు తీసుకుంటూ స్కూళ్లను నడిపిస్తామని చెప్పారు.
Share your comments