News

తెలంగాణ ప్రభుత్వం గొర్రెల పంపిణీ స్కీమ్ గురించి మీకు తెలుసా? పూర్తి వివరాలు మీకోసం..

KJ Staff
KJ Staff
Telangana Sheep distribution scheme.
Telangana Sheep distribution scheme.

గొల్ల కురుమలకు 75 శాతం సబ్సిడీ పై గొర్రెలను పెంపకానికి అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ స్కీమ్ ఫస్ట్ ఫేజ్ ఈ సంవత్సరానికి గాను ఇప్పటికే ప్రారంభమైంది. కానీ కరోనా కారణంగా దాన్ని ప్రస్తుతం హోల్డ్ లో పెట్టారు. 2017లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికి 3.66 లక్షల గొర్రెలను పంపిణీ చేశారు. దీనికోసం 4,579 కోట్ల ఖర్చు పెట్టింది ప్రభుత్వం. ఇందులో భాగంగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో 20.75 లక్షల గొర్రెలు, 2018-19 సంవత్సరంలో 39.94 లక్షలు ,2019-20 39.28 లక్షల గొర్రెలు ,2020-21 సంవత్సరంలో కరోనా ఉన్నా సరే 37.12 లక్షల గొర్రెలు పంపిణీ చేయడం విశేషం.

ఈ స్కీమ్ ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 2017లో లాంఛ్ చేశారు. అప్పట్లో ఒక్కో గొర్రెకు గాను 1.25 లక్షల ఖరీదుగా నిర్ణయించారు. అందులో 75 శాతం అంటే 93000 ప్రభుత్వం భరిస్తుంది. మరో 32 వేల రూపాయలను గొర్రెలు కొనాలనుకున్నవారు భరించాల్సి ఉంటుంది. ఇది ప్రత్యేకంగా కేవలం గొల్ల కురుమల కోసమే ఏర్పాటు చేసిన పథకం. దీని ద్వారా రాష్ట్రంలో గొర్రెల సంఖ్య నాలుగు రెట్లు అవుతుందని అంచనా వేశారు. గ్రామ ఆర్థిక వ్యవస్థ బలపడేందుకు దీన్ని మార్గంగా ఎంచుకున్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ స్టేట్ షీప్ డెవలప్ మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ (TSSGDCF)ఆధ్వర్యంలో నాలుగు రాష్ట్రాల నుంచి గొర్రెలను కొని మరీ వాటిని పంచడం జరిగింది. ఈ కార్యక్రమం కోసం నెల్లూరు బ్రౌన్, నెల్లూరు జొడిపి, దక్కణీ, మద్రాస్ రెడ్ గొర్రెల రకాలను ఎంచుకున్నారు.

ఈ ఏడాది కూడా దాదాపు మూడు లక్షల గొర్రెలను పంపిణీ చేయాలని నిర్ణయించి దీనికి గాను బడ్జెట్ లో కూడా మూడు వేల కోట్లను కేటాయించింది. ఫేజ్ 1 కింద దీనికి గాను 28 వేలకు పైగా గొల్ల కురుమలు డీడీలు కట్టి అప్లై చేసుకున్నారు. వీరికి రూ. 360 కోట్ల రూపాయల ఖరీదైన గొర్రెలను సప్లై చేయనున్నారు. పూర్తిగా ఈ ఆర్థిక సంవత్సరంలో 4210 కోట్ల బడ్జెట్ తో గొర్రెలు ఖరీదు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.

అర్హతలు ఇవే..

ఈ పథకం కేవలం గొల్ల కురుమ వర్గాలకు చెందిన వారి కోసమే ఏర్పాటు చేసింది. కాబట్టి కురుమలు, యాదవులు మాత్రమే దీనికి అర్హులు. దీంతో పాటు పద్దెనిమిది సంవత్సరాల పైబడి ఉండాలి. ఇలాంటివారు అప్లై చేసుకుంటే వారి అర్హతల మేరకు వారికి ఒక యూనిట్ గొర్రెలను ఇవ్వడం జరుగుతుంది. ఈ యూనిట్ లో 20 ఆడ గొర్రెలు, ఒక పొట్టేలు ఉంటాయి.

మరిన్ని సేవలు

కేవలం గొర్రెలు అందించడం మాత్రమే కాదు. వాటికోసం మొబైల్ వెటర్నరీ యూనిట్లను కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇవి జబ్బుపడిన గొర్రెలకు చికిత్సను అందిస్తాయి. 1962 అనే టోల్ ఫ్రీ నంబర్ కి ఫోన్ చేస్తే ఈ మొబైల్ అంబులెన్స్ లు వెంటనే గ్రామాలకు చేరుకొని చికిత్స చేస్తాయి. ఈ గొర్రెలకు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఒక గొర్రె చనిపోతే రూ.5000, పొట్టేలు మరణిస్తే రూ.7000 లభిస్తాయి. వీటి మేత కోసం మంచి గడ్డి గింజలపై 75 శాతం సబ్సిడీని కూడా అందిస్తోంది ప్రభుత్వం.

ఈ పథకం ప్రారంభించిన తర్వాత తెలంగాణలోని గొర్రెల సంఖ్య మిగిలిన రాష్ట్రాల కంటే పెరిగి దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. ఐదు లక్షలకు పైగా కుటుంబాలు ఆర్థిక ఆవలంబన పొందుతున్నాయి. పెద్దగా చదువు లేని గ్రామీణ గొల్ల కురుమలు పట్టణాలకు వలస వెళ్లడం, కూలీ పనులు చేయడం కంటే తమకు తాముగా వ్యాపారాన్ని ప్రారంభించి మంచి లాభాలను పొందే వీలు కల్పించింది ఈ పథకం. దేశంలోనే మాంసం ఎక్కువగా తినే రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. సగటున తెలంగాణకు చెందిన ఒక్క వ్యక్తి దాదాపు 5.5 కేజీల మాంసాన్ని తింటున్నట్లుగా వెల్లడించాయి ప్రభుత్వ గణాంకాలు. అయినా ప్రతి ఒక్కరికీ సరిపోయేలా రాష్ట్రంలోని గొర్రెలు, మేకల సంఖ్య ఉండడం విశేషం. ఉత్తరాది ప్రజలు ఎక్కువగా మేక మాంసం ఇష్టపడితే తెలంగాణకు చెందిన వారు మాత్రం గొర్రె మాంసం తినేందుకే ఇష్టపడతారు.

https://krishijagran.com/animal-husbandry/best-sheep-breeds-in-india-for-highest-wool-meat/

https://krishijagran.com/animal-husbandry/what-are-the-advantages-modern-methods-of-sheep-farming-business-read-tips-for-better-production-maximum-profit/

Share your comments

Subscribe Magazine

More on News

More