ఎండాకాలం మొదలైంది. మొన్నటివరకు చలిపులితో వణికిన ప్రజలను ఇప్పుడు సూర్యుడు భయపెడుతున్నాడు. మార్చి నెలలోనే ఎండలు కాస్త పెరగ్గా.. ఏప్రిల్ వచ్చేసరికి ఎండలు మరింతగా పెరగుతున్నాయి. వడగాల్పులు మొదలవ్వడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో ఏ రేంజ్‌లో ఉంటాయనేది ఆందోళన కలిగిస్తోంది.
భానుడి ఉగ్రరూపంకి తోడు వడగాలులు వీస్తుండటంతో ప్రజలు ఇంటినుంచి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. బయటికి రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. వడదెబ్బ ఎక్కడ తగులుతుందోనని జంకుతున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావడం తగ్గించేస్తున్నారు. ఇక ఆఫీసులకు వెళ్లేవారికి ఇబ్బందులు తప్పడం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో ప్రజలు భానుడి ఉగ్రరూపానికి తట్టుకోలేకపోతున్నారు. మరోవైపు వండగాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ వేడితో శీతలపానీయాలను తీసుకుంటున్నారు. దీని వల్ల కాస్త ఉపశమనం లభిస్తోంది.
ఈ క్రమంలో వాతావరణశాఖ అధికారులు షాకింగ్ న్యూస్ చెప్పారు. రాబోయే రెండురోజుల పాటు ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని వెల్లడించారు. ఆది, సోమవారాల్లో పగటి ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు పెరిగే అవకాశముందన్నారు.
అందుకే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
అటు నిన్న భద్రాచలంలో అత్యధికంగా 42.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవ్వగా.. ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, రామగుండంల్లో 40– 42 డిగ్రీల మధ్య నమోదైంది. ఇక ఖమ్మంలో సాధారణం కంటే 5 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదవ్వగా.. గ్రేటర్ హైదరాబాద్‌లో 39.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
Share your comments