ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం గత కొద్ది సంవత్సరాలుగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అతి పెద్ద సంక్షేమ పథకం ఇదే. అలాగే పాపులర్ అయిన పథకం కూడా ఇదే. ఈ పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయంగా మూడు విడతల వారీగా ఏడాదికి రూ.6 వేలు అందిస్తోంది. ఇప్పటివరకు ఎనిమిది విడతల నగదును నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లలో జమ చేయగా.. త్వరలో 9వ విడత డబ్బులను జమ చేసే అవకాశముంది.
అయితే ఈ క్రమంలో పీఎం కిసాన్ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. అనర్హులుగా గుర్తించిన వారి నుంచి సొమ్మును వెనక్కి తీసుకుంటుంది. కొంతమందికి అర్హత లేకపోయినా ఈ స్కీమ్ ద్వారా లబ్ధిపొందుతున్నట్లు తెలిసింది. దీంతో వారి నుంచి డబ్బులు రికవరీ చేసే పనిలో కేంద్రం పడింది. లబ్ధిదారుల జాబితాపై కేంద్ర ప్రభుత్వం వివిధ సంస్ధలతో స్క్రూటినీ నిర్వహిస్తూ ఉంటుంది. ఇందులో చాలామంది రైతులు అనర్హులుగా తేలింది. అర్హత లేకపోయినా లబ్ధి పొందుతున్నట్లు తెలిసింది. గతంలో ఇలా అనర్హులుగా తేలిన చాలామందిని కేంద్రం లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించింది.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా అర్హత లేని 42 లక్షల మంది రైతులకు రూ.3 వేల కోట్లు బదిలీ చేశామని, వాటిని రికవరీ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా లోక్ సభలో తెలిపింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రకటించారు. అత్యధికంగా అస్సాంలో 8.35 లక్షల మంది అనర్హులుగా తేలినట్లు చెప్పారు. ఆ తర్వాత తమిళనాడులో 7.22 లక్షల మంది, పంజాబ్ లో 5.62 లక్షలు, మహారాష్ట్రలో 4.45 లక్షలు, ఉత్తరప్రదేశ్ లో 2.65 లక్షలు, గుజరాత్ లో 2.36 లక్షల మంది అనర్హులుగా తేలినట్లు వెల్లడించారు.
అనర్హులుగా తేలిన వారి నుంచి డబ్బులు రికవరీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చినట్లు నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. ఐదు ఎకరాలోపు పోలం ఉన్నవారు, ఇన్ కమ్ ట్యాక్స్ కట్టని రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులని కేంద్రం గతంలో మార్గదర్శకాల్లో పేర్కొంది. కానీ కొంతమంది రైతులు ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ పీఎం కిసాన్ సాయం పొందినట్లు తెలిసింది. దీంతో వారి నుంచి డబ్బులు రికవరీ చేస్తోంది. లబ్ధిదారులైన రైతులకు మాత్రమే ఈ పథకం వర్తించేలా చర్యలు చేపడుతోంది. మరి డబ్బులు ఎంతవరకు రికవరీ అవుతాయో చూడాలి.
Share your comments