సరికొత్త పద్ధతులు పాటిస్తూ వ్యవసాయంలో లాభాలు ఎక్కువగా వచ్చే పద్ధతులను ప్రయత్నిస్తున్నారు చాలామంది రైతులు. ఇలా మిగిలిన వారికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. మహారాష్ట్రలోని మిరాజ్ దగ్గర్లోని బెలంకి గ్రామానికి చెందిన
పరమానంద్ గవానే కూడా అలాంటివారిలోనే ఒకరు. తనకున్న రెండు ఎకరాల భూమిలోనే మామిడి సాగు చేస్తూ ఎకరానికి రూ. 6 లక్షల ఆదాయాన్ని పొందుతున్నారు. కేవలం రెండెకరాల్లోనే కేసర్ మ్యాంగో వెరైటీకి చెందిన 1800 చెట్లు నాటి ఏటా సుమారు పదిహేను టన్నుల మామిడి పండ్ల దిగుబడిని పొందుతున్నారు. దీనికోసం ఆయన అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటింగ్ పద్ధతిని అతడు అనుసరించాడు. ఈ పద్ధతి ప్రపంచ దేశాలన్నింటిలో పాపులర్ గా మారినా.. మన దేశంలో ఇప్పుడిప్పుడే రైతులు దీన్ని పాటిస్తున్నారు. ఈ పద్థతి ద్వారా వ్యవసాయంలో దిగుబడులు 200 శాతం పెరుగుతాయట. అంతేకాదు.. పండించే అన్ని కాయలు ఒకే షేప్, రంగు ఉండడంతో పాటు రుచి, తాజాదనం కూడా ఉంటాయట.
ఈయన తోటలో పండే ప్రతి కాయ సుమారు 250 గ్రాముల నుంచి 400 గ్రాముల వరకు ఉండడం విశేషం. అందుకే దిల్లీ, హైదరాబాద్, కోల్ కతా, బెంగళూరు, రాయ్ పూర్ వంటి ప్రదేశాల నుంచి వచ్చి ఆయన పంటను వ్యాపారులు కొనుగోలు చేసుకొని తీసుకువెళ్లడం విశేషం. ఈయన పంట వేసినప్పటి నుంచి ప్రతి ఏడాది దిగుబడి పెరుగుతూనే వస్తోంది. 2015 లో మొదటిసారి పంట కాతకు వచ్చినప్పుడు ఎకరానికి మూడు టన్నుల దిగుబడి వచ్చింది. గతేడాది ఎకరానికి ఏడున్నర టన్నుల దిగుబడి రావడం విశేషం. ప్రస్తుతం తాను పాటిస్తున్న ఫలసాయ పద్ధతులతో త్వరలోనే ఎకరానికి పది టన్నుల దిగుబడిని సాధిస్తానని అతడు నమ్మకంగా ఉన్నాడు.
గతంలో ఆయన ద్రాక్ష తోట పండించేవారట. కానీ లింగ్నూర్ లో ఓ రైతు ఇలా హై డెన్సిటీ ప్లాంటేషన్ పద్ధతిలో పండించడం చూశాడట. అయితే అతడు ఆ పంటకు సంబంధించిన వివరాలను బయటకు చెప్పడానికి ఇష్టపడలేదట. అయితే దీని గురించి వ్యవసాయ అధికారులను సంప్రదించి వివరాలు తెలుసుకొని, పండించే విధానం తెలుసుకున్నాడట పరమానంద్. ఒకవేళ నేను ఈ పద్ధతిలో సక్సెస్ అయితే నా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరికీ ఇందులోని చిట్కాలు, నా అనుభవాలను అందరికీ పంచి వారికి కూడా లాభాలు వచ్చేలా చేయాలని ఆరోజే నిర్ణయించుకున్నా అంటారాయన. ప్రస్తుతం ఆయన ప్రతి నెల 50 మందిని తన పొలానికి పిలిచి వారికి పంట పండించే పద్ధతులు నేర్పిస్తారట. గతేడాది కరోనా ఉన్నా 2000 మంది రైతులు ఈయన దగ్గర పంట పండించే పద్ధతులు నేర్చుకోవడం విశేషం. మే, జూన్ నెలల్లో ఎక్కువ కాత ఉండడంతో ఆ సమయంలో ఎక్కువ మంది ఇక్కడికి వచ్చేందుకు ఇష్టపడతారట.
మహారాష్ట్రలోని వేడి, పొడిబారిన వాతావరణంతో పాటు ఆయన పొలంలోని నేల కూడా ఈ పద్దతిలో పంటను పెంచేందుకు ఉపయోగపడ్డాయట. ఆయన కేసర్ మ్యాంగో రకాన్ని పెంచుతున్నారు. కానీ ఇతర రకాలైన ఆమ్రపాలి, మల్లిక, సింధు వంటివాటిని కూడా ఇలా పండించే వీలుంటుందట. ఈ మొక్కలన్నింటినీ సంవత్సరానికి రెండు సార్లు ప్రూనింగ్ చేయడం వల్ల పంటలు బాగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఎందుకంటే ఈ పద్ధతిలో చెట్లు ఏడు అడుగుల కంటే ఎత్తు పెరగకూడదు. రెగ్యులర్ గా ప్రూనింగ్ చేయడం వల్లే ఈ ఎత్తును కంట్రోల్ చేసే వీలుంటుంది. అంతేకాదు.. సంప్రదాయబద్దంగా పండించే పంటల్లో 7 నుంచి 8 సంవత్సరాలకు పంట వస్తే ఈ పద్ధతిలో పండించే వాటికి మూడు నుంచి నాలుగేళ్లు మాత్రమే పట్టడం విశేషం.
ఈ యూహెచ్ డీపీ పద్ధతి ఇప్పటికి విదేశాల్లోనే అమల్లో ఉంది. ఈ పద్ధతి ద్వారా నీటి వినియోగం కూడా యాభై శాతం మేర తగ్గుతుందట. అంతేకాదు.. 70 శాతం సహజమైన, 30 శాతం కెమికల్ ఫర్టిలైజర్లను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలుంటాయట. ఈ పద్ధతిలో ఫర్టిలైజర్ ని మాత్రం ఎక్కువగా వినియోగించాల్సి వస్తుందని ఆయన వెల్లడిస్తున్నారు. అయితే ఎకరానికి లక్ష రూపాయల పెట్టుబడితో ఏటా ఆరు లక్షల లాభాలను పొందుతున్నారట పరమానంద్. అందుకే తనకు ఉన్న మరో రెండెకరాల పొలంలోనూ గతేడాది మామిడినే నాటారట ఆయన. తన చుట్టూ ఉన్న రైతులు కేవలం ద్రాక్షనే పండిస్తుంటే మామిడి తోటలు వేసి మంచి లాభాలను సాధిస్తున్నారు పరమానంద్.
ఈ యూహెచ్ డీపీ పద్ధతితో పాటు ప్రూనింగ్, డ్రిప్ ఇరిగేషన్ తో పాటు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొమ్మలను పెరగనివ్వడం.. ఆ తర్వాత వాటి పెరుగుదలను ఆపి పూత పూసేలా చేయడం వంటి పద్ధతులు ఎక్కువ దిగుబడులను అందించేందుకు తోడ్పడుతున్నాయట. ఈయన తోటలో కేసర్ తో పాటు రుమానియా రకం మామిడి కూడా ఉండడం విశేషం. ఇవి ఏడాదికి రెండు సార్లు కాపు కాస్తాయట. ఈ మామిడి మంచి లాభాలను అందించడంతో ప్లాంట్ నర్సరీ ఏర్పాటు చేసి ఏటా నలభై వేల మొక్కలను అమ్ముతున్నారట పరమానంద్. తన కుమారులిద్దరి సాయంతో తొమ్మిది ఎకరాల ద్రాక్ష తోట, నాలుగు ఎకరాల మామిడి తోటతో పాటు ఈ నర్సరీ ని కూడా నిర్వహిస్తున్నారాయన. తాను ఉపయోగించే పద్ధతుల ద్వారా దిగుబడులు రెండు నుంచి మూడు రెట్లు పెరిగాయని ఆయన చెప్పడం విశేషం.
Share your comments