దిల్లీ: కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తోన్న రైతు సోదరులు కేంద్రంపై పోరు బాటను ఉద్ధృతం చేశారు. 43 రోజులుగా చలి, వర్షాలను లెక్కచేయకుండా చట్టాల రద్దు డిమాండ్‌కే కట్టుబడి ఉన్నారు. ఇప్పటికే ఏడు విడతలు చర్చలు జరిగినప్పటికీ.. అన్నదాతలు ఆశించిన ఫలితం రాలేదు. దీంతో గురువారం దేశ రాజధాని దిల్లీకి నాలుగు సరిహద్దులవైపు ట్రాక్టర్ల ర్యాలీలను చేపట్టారు. సుమారు 40 రైతు సంఘాల నేతలు దీనిలో పాల్గొన్నారు. దాంతో ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని దిల్లీ, నోయిడా, గురుగ్రామ్ వాహనాదారులకు అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. బుధవారమే ఈ ట్రాక్టర్ల ర్యాలీని తలపెట్టాలని భావించినప్పటికీ వర్షం కారణంగా వాయిదా పడింది.
శుక్రవారం(జనవరి 8) రోజున కేంద్రం, రైతు సంఘాలు మరోసారి సమావేశం కానున్న తరుణంలో అన్నదాతలు దీనిని నిర్వహిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున కిసాన్ పరేడ్ పేరుతో నిర్వహించనున్న భారీ ర్యాలీకి ఇది సన్నాహకంగా ఉంటుందని రైతు సంఘాలు పేర్కొన్నాయి.
కాగా, వ్యవసాయ చట్టాలపై దాఖలైన అన్ని పిటిషన్లపై ఈ నెల 11న విచారణ జరపనున్నట్లు సుప్రీం కోర్టు గతంలోనే ప్రకటించింది. ఇరు వర్గాల మధ్య చర్చలను ప్రోత్సాహిస్తామని తెలిపింది. అయితే, రైతన్నల ఉద్యమంపై మాత్రం ఆందోళన వ్యక్తం చేసింది.
Share your comments