ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలంటే నూతన సాంకేతిక పద్ధతులను అవలంభించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాల్లో ఇప్పటికే వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పద్ధతులను అవలంబించి తక్కువ శ్రమతో అధిక దిగుబడులను సాధిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న మన దేశంలో కూడా ఇప్పుడిప్పుడే వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరికరాల వినియోగం పెరుగుతోందని చెప్పొచ్చు.
ముఖ్యంగా అధిక శ్రమ కలిగి మనుషులపై తీవ్ర దుష్ప్రభావం చూపే రసాయన ఎరువులు, పురుగు మందుల పిచికారీ వంటి పనులకు డ్రోన్లను ఉపయోగించడం మన దేశంలో కూడా మొదలైంది. వ్యవసాయం పనుల్లో డ్రోన్ల వినియోగం పెరుగుతున్న తరుణంలో మన రాష్ట్రానికి చెందిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ప్రస్తుతం రెండు రకాల డ్రోన్లు అభివృద్ధి చేశారు.
పుష్పక్–1: ఈ డ్రోన్ సహాయంతో పంటలపై ఆశించే వివిధ రకాల చీడపీడలకు పిచికారీ చేసే పురుగుమందులను సునాయాసంగా తక్కువ శ్రమతో ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా పిచికారి చేసుకోవచ్చు.
పుష్పక్–2: ఈ డ్రోన్ సహాయంతో రైతులు పొలంలో విత్తనాలు, ఎరువులను సమానంగా తక్కువ ఖర్చుతో వేసుకోవచ్చు. ఈ డ్రోన్ మొత్తం
8 కిలోల బరువు మోయగలదు. ఆటోమేటిక్ స్ప్రేయింగ్ మెకానిజంతో అగ్రికల్చర్ డ్రోన్‌లను రూపొందించారు.
ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు ఈ ఏడాదిలో రాష్ట్రంలోని గుంటూరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా వరి ,పత్తి , మొక్కజొన్న, మినుము, పెసర, శనగ, వేరుశనగ, చెరకు వంటి పంటల్లో డ్రోన్లను వినియోగించాలని నిర్ణయించింది.ఈ డ్రోన్ల సహాయంతో కేవలం పురుగుమందులను ,విత్తనాలను, ఎరువులను వేసుకోవడానికే కాకుండా అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. వీటిని సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లి ప్రయోగించవచ్చు ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలతో జరిగిన నష్టాన్ని డ్రోన్ చిత్రాలతో త్వరితగతిన అంచనా వేయవచ్చు. అలాగే పంట విస్తీర్ణం, భూమి సరిహద్దులను రిమోట్ సెన్సింగ్ చిత్రాల ద్వారా త్వరితగతిన గుర్తించవచ్చు.
Share your comments