
హైదరాబాద్: రైతుల సంక్షేమం దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అన్నదాతలకు సాంకేతికంగా మరింత ప్రాధాన్యం కల్పిస్తూ, ప్రత్యేకంగా 11 అంకెల “విశిష్ట రైతు గుర్తింపు సంఖ్య” (Unique Farmer ID)ను అందించేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ పూర్తవగా, తెలంగాణలో ఈ నెల 23వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వ్యవసాయ శాఖ పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది.
రైతులకు ఆధార్ తరహాలో ప్రత్యేక గుర్తింపు
ప్రతి రైతుకు ఆధార్ కార్డు తరహాలో గుర్తింపు నంబరు కల్పించడం ద్వారా భవిష్యత్తులో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పథకాలు, సబ్సిడీలు, రుణాలు, విత్తన పంపిణీ వంటి అన్ని కార్యక్రమాలకు ఈ యూనిక్ ఐడీ ఆధారంగా సేవలు అందించనున్నారు. ఇకపై రైతు గుర్తింపు సంఖ్య లేనిదే ఆర్థిక సాయం అందే అవకాశాలు తగ్గిపోతాయి.
ఎలా నమోదు చేసుకోవాలి?
ఇతర రాష్ట్రాల్లో మీసేవ కేంద్రాల ద్వారా నమోదు ప్రక్రియ కొనసాగుతుండగా, తెలంగాణలో మాత్రం ప్రత్యేకంగా ఏఈవో అధికారులు గ్రామాలకే వచ్చి నమోదు ప్రక్రియను చేపడతారు. వారు ముందుగా రైతులకు గ్రామంలో వచ్చే తేదీని తెలియజేస్తారు.

రైతులు తీసుకురావాల్సిన పత్రాలు:
- పట్టాదారు పాస్‌బుక్
- ఆధార్ కార్డు
- ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్
ఏఈవోలు ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ ద్వారా ఈ వివరాలను నమోదు చేస్తారు. నమోదు అనంతరం రైతుల ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని యాప్‌లో నమోదు చేసిన వెంటనే రైతు గుర్తింపు సంఖ్య జనరేట్ అవుతుంది. రైతులు దీన్ని భద్రంగా ఉంచుకోవాలి.
గమనిక: మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. లేకపోతే రిజిస్ట్రేషన్ నిలిపివేయబడుతుంది.
ఏ సమస్యలు ఉన్నా ముందుగానే పరిష్కరించుకోండి
- భూమి వివాదాలు ఉంటే నమోదు సమస్యలు ఎదురవుతాయి.
- పాస్‌బుక్, ఆధార్ వివరాలు ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలి.
ప్రచారం, చైతన్య కార్యక్రమాలు ప్రారంభం
ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ గ్రామస్థాయిలో చైతన్య ర్యాలీలు, మోటివేషన్ మీటింగ్‌లు నిర్వహించనుంది. దీని ద్వారా ప్రతి రైతు కావలసిన పత్రాలు సిద్ధం చేసుకొని సకాలంలో రిజిస్ట్రేషన్ పూర్తిచేసేలా ప్రోత్సహించనున్నారు.
మరింత సమాచారం కోసం:
రైతులు తాము నివసిస్తున్న గ్రామ ఏఈవోను సంప్రదించాలి.
Read More:
Share your comments