వర్షాకాలం మొదలవడంతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతుంటాయి. ఈ క్రమంలోనే కొన్నిచోట్ల పిడుగులు పడి ఎంతో మంది రైతులు,మూగజీవాలు మరణిస్తున్న సంఘటనల గురించి మనం వినే ఉంటాం. అసలు పిడుగులు ఎందుకు పడతాయి..? పిడుగులు అంటే ఏమిటి? పిడుగులు పడే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం...
సాధారణంగా ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు సముద్రం, చెరువులలో నీరు ఆవిరి రూపంలో మారి సుమారుగా భూమి నుంచి 25 వేల అడుగుల ఎత్తులో మేఘాలు ఏర్పడతాయి. ఈ క్రమంలోనే మేఘాలపై నుంచి అధిక సూర్యరశ్మి తాకడం వల్ల తక్కువ బరువు ఉన్న ధనావేశిత(+) మేఘాలు పైకి వెళ్లి,అధిక బరువుండే రుణావేశిత (-) మేఘాలు కిందికి వస్తాయి. అంటే వర్షం వచ్చే సమయంలో మనకు కనిపించే నల్లని మేఘాలు అధిక బరువుండే రుణావేశిత మేఘాలు.
సైన్స్ ప్రకారం ఎప్పుడూ కూడా అధిక బరువు కలిగినటువంటి రుణావేశిత మేఘాలలోని ఎలక్ట్రాన్లు తక్కువ బరువు ఉన్నటువంటి ధనావేశిత ఎలక్ట్రాన్లను ఆకర్షిస్తాయి. అయితే ధనావేశిత ఎలక్ట్రాన్లు తక్కువ బరువు కారణంగా పైకి వెళ్ళిపోయాయి కనుక రుణావేశిత ఎలక్ట్రాన్లు పైకి ప్రవహించే లేక వాటికి దగ్గరగా ఉన్నటువంటి వస్తువు అంటే భూమి పై ఒక్కసారిగా అధిక ఎలక్ట్రాన్లు విడుదల చేస్తాయి. దీనినే మనం పిడుగు అంటాము.
ఈ విధంగా మేఘాల నుంచి ఉరుములు మెరుపులు వస్తున్న సమయంలోనే మేఘాలలో ఉన్న ఎలక్ట్రాన్లు భూమిని తాకుతాయి. ఫలితంగా అధిక వోల్టేజ్ భూమిని తాకడం వల్ల మనిషి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతారు. అయితే ఈ విధంగా పిడుగులు ఏ ప్రాంతంలో పడతాయో ముందుగానే అధికారులు గుర్తించి ఆ ప్రాంతంలోని ప్రజలకు ఫోన్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే మనం ఈ పిడుగుపాటు నుంచి బయటపడవచ్చు.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తున్నప్పుడు ఎవరు కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు. ఒకవేళ పొలం పనులలో పనులు చేస్తున్నా వెంటనే ఇంటికి వెళ్ళాలి. అంతేకానీ చెట్ల కింద సెల్ టవర్ కింద కూర్చో కూడదు. కారులో ప్రయాణిస్తున్న వారు కారు దిగకుండా కారులో కూర్చోవడం ఎంతో ఉత్తమం. ఒకవేళ మనకి ఎలాంటి ఆశ్రయం లేకపోతే భూమిపై కాలి వేళ్ళ సహాయంతో కూర్చుని మన మోకాలిపై చేతులు,తల పెట్టి దగ్గరగా ముడుచుకుని కూర్చోవాలి. దాంతో ఆ పిడుగు పడినప్పుడు ఆ విద్యుత్ ప్రవాహం తీవ్రత మనపై తగ్గుతుంది. అదేవిధంగా అధిక ఉరుములు మెరుపులతో వర్షం పడితే ఇంట్లో సెల్ఫోన్లు, టీవీలు,ఫ్రిజ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఆఫ్ చేసి పెట్టుకోవడం ఎంతో ఉత్తమం.ఈ విధమైనటువంటి జాగ్రత్తలను తీసుకోవడం వల్ల పిడుగుపాటు నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు.
Share your comments