Success Story

ఒక్క రోజులో అక్షరాలా 87 లీటర్ల పాలు! భారత గోమాత రికార్డు

KJ Staff
KJ Staff

సాధారణంగా రోజులో ఒక ఆవు 5 నుండి 15 లీటర్ల పాలు ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం. మహా అయితే, హైబ్రీడ్ ఆవులు, గేదెలు 20 లీటర్ల పాలు ఇస్తే అబ్బో… అనుకుంటాం. అయితే మీరు ఎప్పుడైనా ఒకే ఒక్క రోజులో 80 లీటర్లకు పైగా పాలు ఇచ్చే ఆవు గురించి విన్నారా. అవును మీరు విన్నది నిజామే, కేవలం 24 గంటల్లో ఒక ఆవు 87 లీటర్ల పాలు ఇచ్చి ఆసియా రికార్డు బద్దలు కొట్టింది.
ఝిన్జాడవి గ్రామానికి చెందిన సునీల్ చదువు పూర్తి అయ్యాక, సాధారణ ఉద్యోగాల వెంట పడటం మానేసి తన సొంత డైరీ ఫామ్ ని 2014 లో తెరిచారు. ఇక ఆవుల పెంపకంలో ఆరి తేరిన తర్వాతా 2017 నుండి పాల పోటీలకు తన ఆవుల్ని పంపటం మొదలు పెట్టారు. అయితే అదే సంవత్సరం సునీల్ ఆవు NDRI నిర్వహించే పోటీల్లో రెండో స్థానం రావడం తో ఆయన ఉత్సాహం రెండింతలు అయ్యింది.  అప్పడి నుండి కురుక్షేత్ర DFA ఫెయిర్ లో ఆరు సార్లు పోటీచేసిన మెహ్లా, హర్షణీయంగా ఐదు సార్లు మొదటి మరియు ఒక్క సారి రెండో బహుమతి గెలుచుకున్నారు.

కర్నల్ జిల్లా చెందిన సునీల్ మెహ్లా ఎన్నో సంవత్సరాలుగా పాడి పరిశ్రమలో రాణిస్తున్నారు. అతడి ఆవుల్లో ఒక ఆవు ‘సోని’, ఒక్క రోజులో 87 లీటర్ల 740 గ్రాముల పాలు ఇచ్చి, 21 వేల రూపాయిల బహుమతిని గెలుచుకొని అందరిని అవాక్కయ్యేలా చేసింది. హర్యానాకు చెందిన ఈ ఆవు ఆసియన్ రికార్డ్ ఆఫ్ మిల్క్ ప్రొడక్షన్ అనే ఈ రికార్డుని తన కైవసం చేసుకుంది. ఈ ప్రహసనం మొత్తం హర్యానా రాష్ట్రం కర్నల్ జిల్లా లో జాతీయ పాల ఉత్పత్తుల పరిశోధన సంస్థ (NDRI) ఆధ్వర్యంలో నిర్వహించిన డైరీ ఫెయిర్ లో జరిగింది. రెండో స్థానంలో వచ్చినా ఆవు కూడా ఏమి తక్కువ కాదండోయ్, అది కూడా ఏకంగా 70 కిలోల 548 గ్రాముల పాలు ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంకా చిత్రం ఏంటంటే ఈ రెండు ఆవులు మెహ్లా కు చెందినవే కావడం. ఈ ఫీట్ తో మెహ్లా  తన పాత రికార్డు తానే తిరగరాశారు.

సునీల్ పాడి పరిశ్రమలో ఇప్పుడు దాదాపు 150 కి పైగా ఆవులు ఉన్నాయి. అందులో ఎక్కువ శాతం హోల్ స్టైన్ రకానికి చెందినవే. ఇక్కడ గమనించ తగ్గ విషయం ఏంటంటే ఈపోటీ లో గెలిచిన రెండు ఆవులు కూడా ఈ  జాతికి చెందినవే. హోల్ స్టైన్ ఫ్రేయ్ సియన్ కి చెందిన ఈ ఆవులు తమ పాల ఉత్పత్తికి ప్రసిద్ధం. ప్రస్తుతం భారత దేశం లో ఈ ఆవులు 50 నుండి ఒక లక్ష దాకా ధర పలుకుతున్నాయి. ఇందులో సోనీ లాంటి ప్రత్యేకమైన ఆవులకి అంతే ప్రత్యేకమైన ఆహారాన్ని పెడతారంట. 20 కిలోల స్పెషల్ దాణా, 24 కిలోల సైలాజ్, 10 కిలోల పచ్చి మేత, 1.5 కిలోల గడ్డి ఇంకా వాతావరణాన్ని బట్టి వేరే మేత కూడా అందిస్తాము అని సునీల్ తెలిపారు. ఇక వేసవి కాలంలో కూడా తమ గోశాలలో ఉన్న ఆవుల కోసం చక్కని ఏర్పాట్లు చేశామని తెలిపారు. మంచి నీటి వసతి, ఆహారపదార్థాల సరఫరా, గోవుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించడం వల్లే ఇది సాధ్యమైందంటూ అతను చెప్పుకొచ్చారు. అలానే సునీల్ తన డైరి ఫామ్ నుండి కొంత భాగం పాలు నెస్లే కంపెనీకి సరఫరా చేస్తామని, మిగతా వాటిని స్థానిక వినియోగదారులకు అందిస్తామని తెలిపారు.

సునీల్ పాడి పరిశ్రమలో ప్రతి ఏడాది 30 నుండి 35 దాకా దూడలు పుడతాయి. అందులో దాదాపు 10 నుండి 15 ఆవుల్ని అమ్మేసినా, సోని లాంటి ప్రత్యేక మైన ఆవుల్ని మాత్రం పొరపాటున కూడా అమ్మబోమని, సునీల్ తమ్ముడు శాంకీ అంటాడు. సోని వాళ్ళ పాక లో పుట్టిన మొదటి దూడ అంట, అందుకే వాళ్ళు దాన్ని అమిత మైన ప్రేమాభిమానాలతో చూసుకుంటారు. ఈ ఆవు రికార్డు కూడా తక్కువేంకాదు 3 సార్లు మొదటి స్థానం ఒక సారి రెండవ ఒకసారి మూడవ స్థానం గెలుచుకొని అందరిని అబ్బురపరిచింది. ప్రస్తుతం ఈ ఆవుకి 8 ఏళ్ళు.

పూర్తిగా డైరీ ఫామ్ గురించి తెలుసుకున్నాక మాత్రమే ఈ వృత్తి లోకి దిగాలి, కేవలం కాయ కష్టమే కాదు సరైన పోషణ, పెంపకం మీద పూర్తి అవగాహన ఉండాలని తన తోటి పశు పెంపకందారులకి సునీల్ ఇచ్చే సలహా. చదువుకున్నా గాని ఉద్యోగాల వెంట పరుగెత్తకుండ , పాడి పరిశ్రమ లో ఉంటూ, గోవుల పెంపకం చేపట్టి ప్రపంచ వ్యాప్తంగా భారత దేశం పేరు నిలబెతున్న సునీల్ లాంటి వాళ్ళు ఇంకా ముందుకు వెళ్లాలని మా కృషి టీం మనస్ఫూర్తిగా ఆశిస్తోంది . 

Share your comments

Subscribe Magazine

More on Success Story

More