ప్రస్తుతం అన్నిరకాల రంగాలలో అభివృద్ధి చెందినట్లు వ్యవసాయ రంగంలో కూడా ఎంతో అభివృద్ధి చెంది వ్యవసాయం కొత్తపుంతలతో కొనసాగుతోంది. ప్రస్తుత కాలంలో వ్యవసాయం చేయాలంటే పొలం అవసరం లేదు, నాగలి చేతపట్టి నేలను దున్నాల్సిన పనిలేదు. కేవలం మన ఇంటి ప్రాంగణాన్ని వ్యవసాయ క్షేత్రంగా మలుచుకుని విభిన్న పద్ధతులను ఉపయోగించి వ్యవసాయం చేయవచ్చని నిరూపిస్తున్నారు హైదరాబాద్ కి చెందిన లక్ష్మి.
లక్ష్మి చదివింది ఎంసీఏ, తన భర్త ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగా పని చేసేవారు. తన భర్త శాస్త్రవేత్త కావడంతో అతని సహకారంతో లక్ష్మి హైడ్రోపోనిక్ విధానంపై అధ్యయనం చేశారు.కొంపల్లిలో ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కట్టుకొని ఆ పక్కనే 2000 చదరపు అడుగుల స్థలంలో పాలీహౌజ్ వంటి నిర్మాణం చేపట్టారు. సుమారు 15 లక్షలు ఖర్చు చేసి ఇన్ఫినిటీ గ్రీన్ ఫామ్స్’ పేరిట గతేడాది ఏప్రిల్‌లో జల సాగుకు శ్రీకారం చుట్టారు.
ఈ జల సాగు విధానం ద్వారా పంటలు సాగు చేయడానికి మట్టి అవసరం ఉండదు. అలాగే క్రిమిసంహారక రసాయన మందులు కూడా అవసరం ఉండదు. కేవలం సేంద్రీయ పద్ధతిలోనే మన కొళాయి నీటిని ఉపయోగించి పంటను పండించవచ్చు. ఈ విధంగా కొళాయి నీటితోపాటు వర్మ్‌వాష్, పీఎస్‌బీ, నైట్రోజన్ ఫిక్సింగ్, మంచి బ్యాక్టీరియా జోడించి అభివృద్ధి చేసిన మిశ్రమం, జింక్, బోరాన్ తదితర 13 రకాల పోషకాలు సమతలంగా ఇచ్చి అధిక దిగుబడిని పొందుతున్నారు.
ప్రత్యేకమైన నిర్మాణం ద్వారా ఈ నీటిని మొక్కలకు అందిస్తున్నారు. మొక్కలు నీటిని పీల్చుకుని మిగిలిన నీరు తిరిగి ట్యాంక్ లోకి వెళ్ళే విధంగా నిర్మాణాన్ని చేపట్టారు.మట్టిలో పెరిగే మొక్కలతో పోల్చితే ఈ జల విధానం ద్వారా పెరిగే మొక్కలు దిగుబడి తొందరగా ఎక్కువగా వస్తుందని లక్ష్మి తెలియజేశారు. మన ఇంటి టెర్రస్ పై లేదా బాల్కనీలో కూడా ఈ విధమైనటువంటి జల సాగు చేసుకోవచ్చని, ఈ విధమైన సాగు చేయడానికి ఉత్సాహం చూపే వారికి అవసరమైన శిక్షణ సూచనలను కూడా అందిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
Share your comments