ప్రస్తుత కాలంలో ఎంతో మంది యువత ఉన్నత చదువులు చదివినప్పటికీ, ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడినవారు సైతం ప్రస్తుతం వారి అడుగులు వ్యవసాయం వైపు పడుతున్నాయి. ఈ క్రమంలోనే వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టి ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారే సూర్యాపేట జిల్లా మునగాల మండలం నర్సింహులుగూడేనికి చెందిన వెంకటేశ్వర్లు. బిల్ కలెక్టర్ గా పని చేస్తున్నటువంటి వెంకటేశ్వర్లు ఉద్యోగానికి రాజీనామా చేసి రైతుగా మారారు.
బిల్ కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన వెంకటేశ్వర్లు తనకున్న 12 ఎకరాల పొలాన్ని సాగు చేశారు. అయితే తన పొలంలో సాగు చేస్తున్న పంటలకు రసాయనిక ఎరువులను కాకుండా సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేశారు. ఈ క్రమంలోనే జీవామృతం ద్వారా పంటలు పండించిన వెంకటేశ్వర్లు మొదట్లో నష్టాలను ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత జీవామృతంతో పాటు, సేంద్రియ ఎరువులు, వేప పిండి, నూనె మిల్లులో మిగిలిన చెక్క వంటి వ్యర్థ పదార్థాల ద్వారా పంటలను సాగు చేశారు. ఈ క్రమంలోనే అతనికి అధిక పంట దిగుబడి వస్తోంది
ఈ విధంగా సేంద్రియ పంటలను పండించడం ద్వారా చాలా మంది వ్యాపారులు రైతులు వెంకటేశ్వర్లు దగ్గరకు వెళ్లి ధరను ఒప్పందం చేసుకుంటారు. ఈ విధంగా సేంద్రియ పంట పండించిన వెంకటేశ్వర్లు ఆ పంట ధరను కూడా నిర్ణయిస్తాడు. ప్రస్తుతం తన పొలంలో బొప్పాయి సాగు చేస్తున్నారు. అదేవిధంగా వివిధ రకాల కూరగాయలను కూడా సేంద్రీయ పద్ధతిలో సాగు చేయడంతో సాగుకు ముందే మార్కెట్ వారు ఈ రైతుతో ఒప్పందం కుదుర్చుకుని పంట పూర్తయ్యేవరకు వారి వాహనాలను పంపి పంటను తీసుకెళ్ళేవారని తెలిపారు. ఈ విధంగా సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయాన్ని చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన వెంకటేశ్వర్లులకు "భారత వ్యవసాయ పరిశోధన మండలి" (ఐసీఏఆర్) జాతీయస్థాయి పురస్కారానికి ఎంపికయ్యారు.
Share your comments